common mistakes: స్టాక్ మార్కెట్ గరిష్ఠాల్లో ఉన్నప్పుడు ఈ తప్పులొద్దు: నిపుణుల సలహా

  • పరుగులు పెట్టే స్టాక్స్ ను పట్టుకునే ప్రయత్నం వద్దు
  • ఇతరులను గుడ్డిగా అనుసరించడం సరికాదు
  • భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకోవాలి
  • ఫండమెంటల్స్ ఆధారంగా పెట్టుబడులు ఉండాలి
9 common mistakes equity investors must avoid now as stock market flirts with peak

దేశ ఈక్విటీ మార్కెట్ గరిష్ఠ స్థాయుల నుంచి 2 శాతం దిగువలో ట్రేడ్ అవుతోంది. విడిగా చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కొత్త శిఖరాలకు చేరి పరుగులు పెడుతున్నాయి. మార్కెట్లో బుల్స్ ర్యాలీ చేస్తున్న తరుణంలో రిటైల్ ఇన్వెస్టర్లు సహజంగా ఉద్రేకానికి లోనవుతుంటారు. పరుగులు పెట్టే షేర్లకు ఆకర్షితులై అధిక ధరల వద్ద కొనుగోలు చేసి చిక్కుకుపోతుంటారు. ఈ తరుణంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు చెప్పే సూచనలు తెలుసుకుందాం.

గుడ్డిగా అనుసరణ వద్దు..
గొర్రెల మంద మాదిరిగా ఇతర ఇన్వెస్టర్లను చూసి వాతలు పెట్టుకోకూడదు. ఒక స్టాక్ ఒక ధర నుంచి చూస్తుండగానే పెరిగిపోయిందనుకోండి. అమ్మో ఇక ఆ స్టాక్ మరింత పెరిగిపోతుందని, దాంతో దాన్ని కొనుగోలు చేయలేమనే వర్రీతో కొందరు ఇన్వెస్టర్లు అధిక ధరల వద్ద కొనుగోళ్లు చేస్తుంటారు. దీన్నే ఫోమో అంటుంటారు. ఇలాంటి ఫోమో అస్సలు పనికిరాదు. స్నేహితులు లేదా తెలిసిన వాళ్లు లేదా అనలిస్ట్ లు చెప్పారని ఏదో ఒక స్టాక్ ను కొనేయవద్దు. స్టాక్ కొనుగోలు చేయడానికి ముందు చూడాల్సిన ఫండమెంటల్స్ ను విస్మరించొద్దు. రిస్క్ ను అంచనా వేసుకుని, తగినంత అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలి. 

భావోద్వేగాలు
మార్కెట్లు బుల్ ర్యాలీలో , అలాగే మార్కెట్ పతనాల్లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఎంతో అవసరం. పెట్టుబడి నిర్ణయాలపై భావోద్వేగాల పాత్ర ఉండకూడదు. దీనివల్ల తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడి నిర్ణయం ఏదైనా గణాంకాల ఆధారంగానే ఉండాలి. లేదంటే ఉద్రేకంతో ఏ ధరలో పడితే ఆ ధరలో కొనుగోలు చేయడం, నష్టాలకు విక్రయించే ప్రమాదం ఏర్పడుతుంది.

మూలాలు
కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక మూలాల అధ్యయనం తప్పనిసరి. కంపెనీ, అది చేస్తున్న వ్యాపారం, పనిచేస్తున్న రంగం, ఆ రంగంలో కంపెనీ స్థానం, ఆదాయం, లాభాలు, రుణ భారం, ప్రమోటర్ల వాటా, అది తనఖాలో ఉందా? ఇత్యాది అంశాలు ఎన్నింటినో విశ్లేషించుకోవాలి. నిజానికి ఒకం కంపెనీ షేరుకు ఎంత ధర పెట్టి కొనుగోలు చేయవచ్చు? అనేది ఎలా నిర్ణయిస్తారు? దీనికి ఫండమెంటల్స్ ప్రామాణికం అవుతుంది. ఇది తెలియనప్పుడు ఏ ధరలో కొనుగోలు చేయాలి, విక్రయించాలన్నది జూదం మాదిరిగా చేసినట్టు అవుతుంది. 

మార్కెట్లను అనుసరించే ప్రయత్నం వద్దు
మార్కెట్లు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో ఎవరూ ఊహించలేరు. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో విక్రయించి, తిరిగి పడిపోయినప్పుడు కనిష్ఠ స్థాయిలో కొనుగోలు చేద్దామని అనుకోవడం పొరపాటే అవుతుంది. మార్కెట్ టైమ్ ను ఎవరూ నిర్ణయించలేరు. నిపుణులకు సైతం ఇది సవాలుగా ఉంటుంది. మార్కెట్లు పెరగడం, పడడంతో సంబంధం లేకుండా, విడిగా పెట్టుబడి పెట్టే కంపెనీ ఫండమెంటల్స్ ఆధారంగా ఎంట్రీ, ఎగ్జిట్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన.

పనితీరు ఆధారంగానా?
కొందరు ఇన్వెస్టర్లు అప్పటి వరకు ర్యాలీ చేసిన స్టాక్స్ ను చూసి.. అవి ఇంకా పెరుగుతాయనే ఆశలు, అంచనాలతో కొనుగోలు చేస్తుంటారు. కానీ, అప్పటికే పెరిగిన స్టాక్ లాభాల స్వీకరణతో దిద్దుబాటుకు గురయ్యే రిస్క్ కూడా ఉంటుంది. పైగా అప్పటికప్పుడు ఆ కంపెనీ లేదా ఆ రంగానికి సంబంధించి ప్రతికూల పరిణామాలు ఏర్పడవచ్చు. అందుకని ర్యాలీని చూసి మోసపోవద్దు.

వైవిధ్యం
అన్ని గుడ్లను ఒకే డబ్బాలో పెట్టొద్దన్నది సామెత. అలా చేస్తే గుడ్లు పగిలే ప్రమాదం ఉంటుంది. అలాగే పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట పెట్టేయవద్దు. వివిధ రంగాలు, వివిధ కంపెనీల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. అప్పుడు ఏదో ఒక రంగం లేదా , ఒక కంపెనీకి వ్యతిరేక పరిణామాలు ఏర్పడినా ఆందోళన చెందక్కర్లేదు. 

ప్రణాళిక
ప్రణాళిక మేరకే పెట్టుబడుల వ్యవహారాలు ఉండాలి. రిస్క్ ను దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబడికి ముందే ఎంత రిస్క్ తీసుకోగలననేది స్పష్టతకు రావాలి. నష్టాలు వస్తే ఆ పెట్టుబడిని కొనసాగిస్తారా..? పెరిగితే ఏ ధరలో విక్రయిస్తారు? ఏ రంగానికి ఎంత కేటాయింపులు, నష్ట భయం తగ్గించుకునేందుకు ఏం చేయాలి? ఇలాంటి అన్ని అంశాలతో సమగ్ర ప్రణాళిక మేరకు వ్యవహరించాలి.

More Telugu News