tsrtc: బిల్లును హడావుడిగా ఆమోదిస్తే కార్మికులకు ఇబ్బందని గవర్నర్ చెప్పారు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy on RTC bill after meeting with governor

  • ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మకమన్న అశ్వత్థామరెడ్డి
  • గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నల్లో నాలుగు కార్మికుల ప్రయోజనాలకు సంబంధించినవేనని వెల్లడి
  • కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను గవర్నర్ గుర్తు చేశారన్న జేఏసీ చైర్మన్

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మకమని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ బిల్లును హడావుడిగా రూపొందించి, ఆమోదిస్తే కార్మికులు ఇబ్బందుల్లో పడతారని గవర్నర్ తమతో చెప్పినట్లుగా వెల్లడించారు. గవర్నర్ లేవనెత్తిన ఐదు ప్రశ్నల్లో నాలుగు కార్మికుల ప్రయోజనాలకు సంబంధించినవే అన్నారు. కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నట్లు గవర్నర్ గుర్తు చేశారన్నారు. కార్మికుల కోణంలోనే గవర్నర్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, గవర్నర్‌తో టీఎంయు నేతలు చర్చలు జరిపారు. బిల్లును వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం టీఎంయూ నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె చెప్పారన్నారు. త్వరలో బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.

అంతకుముందు గవర్నర్ తమిళిసై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. ఆర్టీసీ రాజ్ భవన్ ముట్టడికి సంబంధించిన పేపర్ కటింగ్‌ను పోస్ట్ చేస్తూ... కార్మికుల ప్రయోజనాల కోసమే తాను ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోందని తెలిసి ఆవేదన చెందానని, గతంలో సమ్మె సమయంలోను తాను వారి వెంటే ఉన్నానని, ఇప్పుడు వారి హక్కులను కాపాడటం కోసం బిల్లును జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News