Mani Ratnam: తన తోటి డైరెక్టర్లకు స్పెషల్ పార్టీ ఇచ్చిన మణిరత్నం

  • పలువురు దర్శకులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసిన మణిరత్నం
  • శంకర్, మురగదాస్, గౌతమ్ మీనన్, లోకేశ్ కనగరాజ్ తదితరుల హాజరు
  • ఈ క్షణాలు ఎంతో విలువైనవన్న శంకర్
mani ratnam hosts special evening for shankar and tamil directors

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తోటి డైరెక్టర్లకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. గురువారం సాయంత్రం తన నివాసంలో గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అగ్రదర్శకులు శంకర్, మురగదాస్, గౌతమ్ మీనన్, లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, లింగుస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరంతా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను మాట్లాడుకున్నారు. 

తమ గెట్ టు గెదర్‌‌కు సంబంధించిన వివరాలను దర్శకుడు శంకర్ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోను షేర్‌‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మణిరత్నంకు ధన్యవాదాలు తెలిపారు. టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్‌ను కలవడం, మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను మాట్లాడుకోవడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌ ఎవర్‌‌గ్రీన్‌ పాటలను కార్తిక్ ఆద్భుతంగా పాడారని పేర్కొన్నారు. ఈ క్షణాలు ఎంతో విలువైనవని తెలిపారు. మంచి ఆతిథ్యాన్ని అందించినందుకు సుహాసినికి ధన్యవాదాలు తెలిపారు. 

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులతో మణిరత్నం ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. కరోనా సమయంలో తమిళ దర్శకులందరికీ జూమ్ కాల్ చేసి.. కాసేపు మాట్లాడారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల పొన్నియన్ సెల్వన్–2తో మణిరత్నం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేశ్‌ కనగరాజ్ ‘లియో’ చిత్రంతో, శంకర్ ‘గేమ్‌చేంజర్‌‌’ మూవీతో బిజీగా ఉన్నారు.

More Telugu News