Sachin Pilot: తెలంగాణ సహా ఈ నాలుగు రాష్ట్రాల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: సచిన్ పైలట్

Congress will win in these 4 states says Sachin Pilot

  • అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న సచిన్ పైలట్
  • రైతులకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనేనని వ్యాఖ్య
  • మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరుకున్నాయని విమర్శ

దేశంలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టాయి. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ తదితర అన్ని రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. త్వరలో జరగనున్న ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. 

రైతులకు ఎల్లవేళలా అండగా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సచిన్ పైలట్ అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుందని... లేకపోతే ఈ పాటికి రైతులు నాశనం అయ్యేవారని అన్నారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా... ఇప్పటి వరకు విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెచ్చింది లేదని సచిన్ విమర్శించారు. మోదీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ... విపక్ష నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News