Facebook Love: ఫేస్‌బుక్ ప్రేమ.. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి

Sri Lanka Girl came to Chittoor and marries facebook friend

  • 20 రోజుల క్రితం అరిమాకులపల్లె వచ్చిన విఘ్నేశ్వరి
  • ఆలయంలో వివాహం జరిపించిన పెద్దలు
  • వచ్చే నెల 6వ తేదీ వరకు వీసా గడువు
  • ఆలోగా వెళ్లిపోవాలంటున్న పోలీసులు

ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ ప్రేమలతో దేశాలు దాటుతున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువవుతోంది. పబ్జీ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ వివాహిత భారత్‌లోని నోయిడా రాగా, ఫేస్‌బుక్ ప్రియుడి కోసం రాజస్థాన్ యువతి పాకిస్థాన్ వెళ్లి మతం మార్చుకుని మరీ అతడిని పెళ్లాడింది. మరో ఘటనలో చైనా అమ్మాయి పాక్ వెళ్లింది. తాజాగా శ్రీలంక అమ్మాయి చిత్తూరు వచ్చి ఫేస్‌బుక్ ప్రియుడిని పెళ్లాడింది.

శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరికి చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. అదికాస్తా ముదిరి ప్రేమకు దారితీసింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించిన విఘ్నేశ్వరి 20 రోజుల క్రితం ప్రియుడిని వెతుక్కుంటూ అరిమాకులపల్లె వచ్చింది. విషయం తెలిసిన పెద్దలు 15 రోజుల క్రితం ఆలయంలో వివాహం జరిపించారు.

గ్రామానికి చెందిన యువకుడు శ్రీలంక యువతిని పెళ్లాడిన విషయం ఆనోటా ఈనోటా పడి పోలీసులకు చేరింది. వెంటనే వారు గ్రామానికి చేరుకుని యువతి వీసాను పరిశీలించారు. ఆమె వద్ద సరైన పత్రాలు ఉండడం, వీసా గడువు వచ్చే నెల 6 వరకు ఉండడంతో ఆలోగా దేశం విడిచి వెళ్లాలని చెబుతూ నోటీసులిచ్చారు. యువతిని రిజిస్టర్ వివాహం చేసుకుని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాలని యువకుడి తల్లిదండ్రులను కోరారు.

Facebook Love
Sri Lanka
Chittoor District
Arimakulapalli
  • Loading...

More Telugu News