TSRTC: హైదరాబాద్ - విజయవాడ సర్వీసులను రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ

TSRTC cancel bus service to vijayawada from hyderabad

  • మున్నేరు వాగు పొంగుతుండడంతో జాతీయ రహదారిపైకి చేరిన వరద
  • వాహనాలు నిలిచిపోవడంతో సర్వీసులు రద్దు చేసినట్లు ఎండీ సజ్జనార్ ట్వీట్
  • ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర్లోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు జాతీయ రహదారిపైకి చేరింది. విజయవాడ - హైదరాబాద్ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ - విజయవాడ మధ్య నడిచే రెగ్యులర్ బస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు.

సజ్జనార్ ట్వీట్ మేరకు.. హైదరాబాద్ - విజయవాడ మధ్య రెగ్యులర్ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

  • Loading...

More Telugu News