Gyanvapi: జ్ఞానవాపి మసీదులో మొదలైన సర్వే.. ఆపాలంటూ సుప్రీంకోర్టుకు మసీదు నిర్వహణ కమిటీ

Gyanvapi survey contrary to spirit of Supreme Court order says Muslim petitioners

  • జిల్లా కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం సర్వే ప్రారంభించిన 30 మంది అధికారులు
  • సర్వే సుప్రీంకోర్టు గత ఆదేశాలకు విరుద్ధమంటున్న ముస్లిం కమిటీ
  • అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి 

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైంది. సోమవారం ఉదయం 30 మంది సభ్యులతో కూడిన అధికారుల బృందం సర్వే చేబట్టింది. ఒకప్పటి హిందూ ఆలయంపై ఈ మసీదు నిర్మించారా అన్న విషయాన్ని వీరు నిర్ధారించనున్నారు. మరోవైపు వారణాసిలోని నిర్మాణ ప్రాంగణంలో ఈ సర్వేపై 
స్టే విధించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సర్వే అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు వాయిదా వేసిందన్న విషయాన్ని తమ పిటిషన్‌లో పేర్కొంది. 

మొత్తం ప్రాంగణంలోని తవ్వకాలతో సహా సర్వే కోసం ఆదేశించడం వల్ల మసీదులోకి ముస్లింల ప్రవేశానికి ఆటంకం కలుగుతుందని, సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలో జిల్లా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు, స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కూడా కోరింది. జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విగ్రహాలను పూజించే హక్కు ఐదుగురు హిందూ మహిళలకు ఉందంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాగా, సర్వేకు సంబంధించి ఆగస్టు 4 నాటికల్లా సంబంధిత వీడియోలను, ఫొటోలతో ఓ నివేదికను సమర్పించాలని గతవారం జిల్లా కోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది.

  • Loading...

More Telugu News