Ambati Rambabu: పవన్ కల్యాణ్ ను ఇకపై ఏకపత్నీవ్రతుడని పిలుస్తాం: మంత్రి అంబటి వ్యంగ్యం

  • పవన్‌కు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే కోపం వస్తుందన్న అంబటి
  • ఏక కాలంలో ఒక పత్ని మాత్రమే ఉంటుందని వ్యాఖ్యలు
  • పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్న మంత్రి
minister ambati rambabu satirical comments on pawan kalyan marriages

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. పవన్‌కు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే కోపం వస్తుందని, ఇకపై ఆయన్ను ఏకపత్నీవ్రతుడని పిలుస్తామని ఎద్దేవా చేశారు. ‘‘పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడు.. ఏకపత్నీవ్రతుడు అంటే పవన్‌కు సంతోషంగా ఉంటుందేమో!.. పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నినే ఉంటుంది.. ఇది బాగుందా?’’ అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘‘పవన్‌కు ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలి. అలా వచ్చే వారికి పవన్ కేసు.. ఓ కేస్ స్టడీగా పనికొస్తుంది” అని సెటైర్లు వేశారు. మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ చాలా అమర్యాదగా మాట్లాడారని, మళ్లీ ఎప్పుడు వస్తారని పవన్‌ను ప్రశ్నించారు. ‘‘మీరు  రావాలంటే ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్కలు తేలకుండా రారులేండి’ అని వ్యంగ్యంగా అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించారని, వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని అన్నారు. బందరు వెళ్లి చెప్పులు వెతుక్కుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రాష్ట్రంలో హిందూ ధర్మ రక్షణకు వచ్చిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అట. దేవుడి దగ్గర పెట్టిన దీపంతో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ కొడుకు.. హిందూ ధర్మ రక్షణకు వచ్చాడట” అంటూ అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.

More Telugu News