Elina Svitolina: వింబుల్డన్ లో పెను సంచలనం... వరల్డ్ నెంబర్ వన్ ను ఇంటికి పంపిన ఉక్రెయిన్ అమ్మాయి

  • ఇంటి ముఖం పట్టిన ఇగా స్వైటెక్
  • క్వార్టర్ ఫైనల్లో ఎలినా స్విటోలినా చేతిలో ఓటమి
  • సెమీస్ చేరిన స్విటోలినా
  • స్విటోలినా వరల్డ్ 76వ ర్యాంక్ క్రీడాకారిణి
Elina Svitolina of Ukraine crashes out world number one Iga Swiatek from Wimbledon

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఉక్రెయిన్ కు చెందిన వరల్డ్ 76వ ర్యాంక్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా 7-5, 6-7, 6-2తో స్వైటెక్ ను ఇంటిదారి పట్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలో దిగిన స్విటోలినా అనూహ్య విజయంతో సెమీస్ చేరింది. 

తొలి సెట్ ను స్విటోలినా చేజిక్కించుకోగా, రెండో సెట్ లో ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ బయటపడిన స్వైటెక్, ఆ సెట్ ను టైబ్రేకర్ లో గెలుచుకుంది. అయితే మూడో సెట్ లో అదే ఊపు కనబర్చడంలో విఫలమైన స్వైటెక్ ప్రత్యర్థికి తేలిగ్గా తలవంచింది. చివరి సెట్ లో స్విటోలినా పలుమార్లు స్వైటెక్ సర్వీస్ ను బ్రేక్ చేయడమే అందుకు నిదర్శనం. 

కాగా, సెమీస్ లో స్విటోలినా... చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వోండ్రొసోవాతో తలపడనుంది.

More Telugu News