titanic: జలాంతర్గామిలో చిన్న లోపంతోనే... చనిపోతామని తెలిసేలోపే గాల్లో కలిసిన ప్రాణాలు!

Why and how the submersible might have imploded

  • టైటానిక్ శకలాలకు 1,600 అడుగుల దూరంలో టైటాన్ ఆనవాళ్లు
  • దెబ్బతిన్న జలాంతర్గామి ప్రెజర్ చాంబర్
  • సముద్రం ఒత్తిడిని తట్టుకోలేక కుప్పకూలిన టైటాన్

టైటానిక్ శకలాల సందర్శనకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ కుప్పకూలిపోయిందని యూఎస్ కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ ముగేర్ తెలిపారు. టైటానిక్ శకలాలకు 1,600 అడుగుల దూరంలో టైటాన్ ఆనవాళ్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ జలాంతర్గామి ప్రెజర్ చాంబర్ పూర్తిగా దెబ్బతిందని, సముద్రం ఒత్తిడిని ఇది ఏమాత్రం తట్టుకోలేక కుప్పకూలినట్లు చెప్పారు. నీటిలో ఒక దశ దాటి లోతుకు వెళ్లే కొద్దీ పీడనం తీవ్రంగా పెరిగిపోతుందని, చుట్టుపక్కల ఒత్తిడి పెరిగిపోయిన సమయంలో మినీ జలాంతర్గామి నిర్మాణంలో ఒక చిన్నలోపం కూడా భారీ విపత్తుకు దారి తీస్తుందని చెప్పారు. ఈ జలాంతర్గామి శకలాలు గుర్తించడానికి ఒకరోజు ముందు ఇది కుప్పకూలినట్లు చెప్పారు.

ఇప్పుడు ఈ మినీ జలాంతర్గామి ప్రమాదానికి గురైన ప్రదేశంలో నీటి పీడనం భూమిపై ఉన్నదాని కంటే 350 రెట్లు అధికంగా ఉంది. టైటానిక్ ఓడ శకలాలు ఉన్న ప్రదేశాన్ని సముద్రంలో మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. 3,300 అడుగుల నుండి 13,100 అడుగుల లోతు వరకు ఉండే ప్రదేశాలను మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా 4 సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ చదరపు అంగుళానికి 2,700 కిలోల పీడనం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న లీకేజీ కూడా ఈ జలాంతర్గామి విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది. గంటకు 1,500 మైళ్ల వేగంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ జలాంతర్గామిలో ఉన్న వారికి ప్రమాదం జరిగి, చనిపోతామని తెలిసేలోపే అంతా జరిగిపోయి ఉంటుందంటున్నారు.

titanic
sea
  • Loading...

More Telugu News