Titan: చావు తరుముకొస్తే అంతే.. పాక్ బిలియనీర్ కుమారుడు యాత్రకు వెళ్లాలనుకోలేదట!

 Pak Billionaires Son Suleman Didnt Want To Go On Titanic Sub
  • యాత్రకు ముందు బాగా భయపడిన సులేమాన్
  • వెళ్లేందుకు తొలుత నిరాకరణ
  • ఫాదర్స్ డే కావడం, తండ్రికి ముఖ్యమైన యాత్ర కావడంతోనే అంగీకారం
  • సముద్రంలోకి వెళ్లిన కొన్ని గంటల్లోనే పేలిపోయిన ‘టైటాన్’
అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లి.. పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పాకిస్థాన్ బిలియనీర్ షహజాద్ దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19) కూడా ఉన్నారు. సులేమాన్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

షహజాద్ సోదరి, సులేమాన్ అత్తయ్య అజ్మే దావూద్ ప్రమాదానికి ముందు ‘ఎన్‌బీసీ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ఈ యాత్రకు సులేమాన్ వెళ్లాలని అనుకోలేదని, బలవంతంగా వెళ్లాడని అన్నారు. టైటాన్‌లో సముద్రగర్భంలోకి వెళ్లడానికి సులేమాన్ బాగా భయపడ్డాడని, అయితే ఫాదర్స్ డే అని, ఆయన తండ్రికి యాత్ర చాలా ముఖ్యం కావడంతోనే వెళ్లడానికి అంగీకరించాడని తెలిపారు. 

అప్పుడే పేలిపోయిన టైటాన్
యాత్రకు బయలుదేరిన కొన్ని గంటల్లోనే టైటాన్ పేలిపోయినట్టు తాజాగా యూఎస్ నేవీ పేర్కొంది. సబ్ మెర్సిబుల్ జాడ గల్లంతైన కాసేపటికే సముద్రం లోపలి నుంచి వచ్చిన పేలుడు శబ్దాలను అమెరికా నేవీ వ్యవస్థలు గుర్తించాయి. అయితే, ఇది రహస్య శబ్ద పర్యవేక్షణ కావడం, శత్రువులను పసిగట్టేందుకు మాత్రమే దీనిని వినియోగిస్తారు కాబట్టి ఆ విషయాన్ని నేవీ బయటపెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఆ పేలుడు శబ్దాలు గల్లంతైన టైటాన్‌వే అయి ఉండొచ్చని నేవీ వెల్లడించింది.
Titan
Titanic Ship
Ocean Gate
Suleman
Pakistan
Azmeh Dawood

More Telugu News