Biparjoy: తరుముకొస్తున్న బిపోర్ జోయ్ తుపాను... సముద్రంలోని ఆయిల్ రిగ్ నుంచి 50 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్

Indian Coast Guard saves 50 members from jack up oil rig in Arabian sea
  • అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను
  • పోరుబందర్ కు 320 కిమీ దూరంలో తుపాను
  • ఈ నెల 15న జఖౌ పోర్టు వద్ద తీరం దాటే అవకాశం
  • గంటకు 8 కిమీ వేగంతో పయనిస్తున్న బిపోర్ జోయ్ తుపాను
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జోయ్ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం గుజరాత్ లోని పోరుబందర్ కు పశ్చిమ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గుజరాత్ లోని మాండ్వీ, పాకిస్థాన్ లోని కరాచీ మధ్య జఖౌ ఓడరేవు వద్ద ఈ నెల 15న తీరం దాటనుంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గుజరాత్ భూభాగం వైపు దూసుకొస్తోంది. 

ఈ నేపథ్యంలో, ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు 50 మందిని కాపాడాయి. అరేబియా సముద్రంలోని 'కీ సింగపూర్' జాకప్ ఆయిల్ రిగ్  లో సిబ్బంది చిక్కుకుపోయారు. భీకరంగా ఎగసిపడుతున్న అలలు, భారీ వర్షం, ఈదురుగాలుల నడుమ వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

ఇందుకోసం ధ్రువ్ అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్, కోస్ట్ గార్డ్ నౌక శూర్ ను ఉపయోగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సమర్థంగా ఆపరేషన్ నిర్వహించిన కోస్ట్ గార్డ్ దళాలు... కీ సింగపూర్ ఆయిల్ రిగ్ సిబ్బందిని రెండు విడతలుగా తీరానికి తరలించాయి. నిన్న 26 మందిని, ఇవాళ 24 మందిని రిగ్ నుంచి తరలించినట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
Biparjoy
Cyclone
Indian Coast Guard
Key Singapore Oil Rig
Arabian Sea

More Telugu News