Tollywood: కోటయ్య వృద్ధాశ్రమం కోసం జోలెపట్టిన ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లు

Tollywood Fight Masters Ram Lakshman Visits Kotaiah Old Age Home
  • చీరాల దండుబాటలోని కోటయ్య వృద్ధాశ్రమాన్ని సందర్శించిన రామ్‌లక్ష్మణ్‌లు  
  • వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన ఫైట్‌మాస్టర్లు
  • వాహనం కోసం పలు ప్రాంతాల్లో భిక్షాటన
సినీ ఫైట్ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌లు జోలె పట్టి రూ. 40 వేలకుపైగా పోగు చేశారు. ఈ మొత్తాన్ని బాపట్ల జిల్లా చీరాలలోని దండుబాటలో ఉన్న కోటయ్య వృద్ధాశ్రమానికి ఇచ్చారు. నిన్న వీరిద్దరూ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమానికి వాహనం లేదన్న విషయాన్ని తెలుసుకున్న రామ్‌లక్ష్మణ్‌లు వాహనం కొనుగోలుకు అవసరమైన డబ్బుల కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జోలెపట్టి భిక్షాటన చేశారు. 

ముంతావారి కూడలి, బెస్తపాలెం, కూరగాయల మార్కెట్ తదితర కూడళ్లలో భిక్షాటన చేశారు. దానికి వారు కొంత వేసుకుని మొత్తం రూ. 43,789 ఆశ్రమానికి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనచుట్టూ ఎంతోమంది పేదలు, వృద్ధులు ఉన్నారని, వారికి సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవలోనే నిజమైన ఆనందం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.
Tollywood
Tollywood Fight Masters
Ram Lakshman
Chirala

More Telugu News