Novak Djokovic: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్

Novak Djokovic rams into French Open final

  • సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ అల్కరాజ్ ను ఓడించిన జకో
  • 6-3, 5-7, 6-1, 6-1తో ఘనవిజయం
  • మూడో టైటిల్ కోసం జకో తహతహ

సెర్బియా టెన్నిస్ యోధుడు, మాజీ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ తో జరిగిన సెమీఫైనల్ సమరంలో జకోవిచ్ 6-3, 5-7, 6-1, 6-1తో ఘనవిజయం సాధించాడు. 

తొలి సెట్ ను అలవోకగా గెలిచిన జకో... రెండో సెట్ లో అల్కరాజ్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. పదునైన సర్వీసులు, బలమైన గ్రౌండ్ షాట్లతో విరుచుకుపడిన స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ ఆ సెట్ ను 7-5తో కైవసం చేసుకున్నాడు. కానీ అక్కడ్నించి జకో మ్యాజిక్ మొదలైంది. అల్కరాజ్ ను ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ, పలుమార్లు అతడి సర్వీసును బ్రేక్ చేస్తూ, జకోవిచ్ వీరవిహారం చేశాడు. తన అనుభవాన్ని, ప్రతిభను మిళితం చేసి వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకుని మ్యాచ్ లో విజేతగా నిలిచాడు. 

జకోవిచ్ గతంలో 2016, 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలిచాడు. ఇప్పుడు మూడో టైటిల్ కోసం ఉరకలేస్తున్నాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్-కాస్పర్ రూడ్ మధ్య జరిగే సెమీస్ విజేతతో జకోవిచ్ ఫైనల్లో తలపడనున్నాడు.

Novak Djokovic
Final
French Open
Carlos Alcaraz
  • Loading...

More Telugu News