Payyavula Keshav: జగన్ స్వార్థ నిర్ణయాలు అటు విద్యుత్ రంగాన్ని, ఇటు ప్రజల్ని నిండాముంచాయి: పయ్యావుల కేశవ్

Payyavula Keshav criticizes AP govt electricity sector

  • ఏపీ విద్యుత్ రంగ పరిస్థితిపై పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు
  • జూమ్ ద్వారా మీడియా సమావేశం
  • ప్రజలపై రూ.57 వేల కోట్ల భారం పడిందన్న పయ్యావుల
  • అందుకు జగన్ నిర్ణయాలే కారణమని ఆరోపణ

ఏపీ విద్యుత్ రంగ పరిస్థితి దారుణంగా తయారైందంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ స్వార్థపూరిత నిర్ణయాలు అటు విద్యుత్ రంగాన్ని, ఇటు ప్రజలను నిండా ముంచాయని విమర్శించారు. తన అసమర్థత, కమీషన్ల కక్కుర్తి, నాసిరకం బొగ్గు కొనుగోళ్లతో విద్యుత్ రంగాన్ని దెబ్బతీశాడని మండిపడ్డారు.  

ప్రజలపై రూ.57 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి, ఆయన సర్కార్ అవినీతి నిర్ణయాలేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమం కంటే విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి ఆయన దోచుకుంటున్నదే ఎక్కువని స్పష్టం చేశారు.  

2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో ఒక్కో కుటుంబం ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించిందీ... ఈ 4 ఏళ్ల నుంచి ఎంత చెల్లిస్తోందో ప్రభుత్వం చెప్పాలని పయ్యావుల నిలదీశారు. ఈ వివరాలు బయటపెడితే ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం ఎంత భారం వేసిందో అర్థమవుతుందని తెలిపారు. పయ్యావుల కేశవ్ ఇవాళ తన నివాసం నుంచి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. 

“ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్ ఛార్జీలంటూ రకరకాల పేర్లతో నేరుగా యూనిట్ ధరలు పెంచకుండా సామాన్యుల్ని దోచుకుంటున్నారు. జగన్ పాలనలో సామాన్య , పేద, మధ్యతరగతి వర్గాల విద్యుత్ వాడకం పెరగలేదు. కానీ విద్యుత్ ఛార్జీల భారం మాత్రం ఎక్కువైంది. 

తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా దాన్ని కాదని ప్రభుత్వం అధిక ధరకు తమకు అనుకూలంగా ఉండేవారి నుంచి కొంటోంది. హిందుజా సంస్థ నుంచి ఈ ప్రభుత్వం ఒక్క యూనిట్ విద్యుత్ కొనకపోయినా, ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు అప్పనంగా రూ.2,200 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. ఈ చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అవకాశమున్నా కూడా ప్రభుత్వం డబ్బు చెల్లించడానికే సిద్ధపడింది. 

కేవలం తమకు వస్తున్న కమీషన్ల కోసమే ప్రభుత్వం హిందుజా సంస్థకు  ఊరికే దోచిపెడుతోంది. అలానే ఇండోస్ సోలార్ సంస్థ విషయంలో కూడా ప్రవర్తిస్తున్నారు. ఒక యూనిట్ విద్యుత్ కొంటూ, రెండు యూనిట్లకు డబ్బు చెల్లిస్తున్నారు. 

ఇక, స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మీటర్ల పేరుతో విద్యుత్ వినియోగదారులు అదనంగా దోపిడికీ గురికాబోతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం పెంచని విధంగా ఏపీ మాత్రమే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. 

2014లో చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం 22 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటులో ఉంది. చంద్రబాబుగారి ఆలోచనలు, ఆయన చేపట్టిన విద్యుత్ సంస్కరణలతో 2019 నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ తో నిలిచింది. 9 వేల మెగావాట్ల ఇన్ స్టాల్డ్ కెపాసిటీని 19 వేల మెగావాట్లకు పెంచడం జరిగింది. 

ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ని అదనంగా తయారుచేసింది లేదు. డబ్బు సంపాదన తప్ప ప్రభుత్వానికి విద్యుత్ రంగం, వినియోగదారుల  ఆలోచన పట్టడంలేదు. రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా, దాన్ని కాదని కమీషన్ల కోసమే బయటనుంచి అధికధరకు కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా విద్యుత్ కొనడం లేదు. 

ఇద్దరున్న కుటుంబమైనా, పదిమంది సభ్యులున్న కుటుంబమైనా, ఏ కుటుంబమై నా టీడీపీ హయాంలో ఎంత విద్యుత్ బిల్లు కట్టింది, ఇప్పుడు ఎంత బిల్లు కడుతోందో చూస్తే విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న దోపిడీ బట్టబయలవుతుంది. 8 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ అదానీ సంస్థకు కట్టబెట్టినదానిలో అవినీతికి తెరలేపారు. హైకోర్టు జోక్యంతో ప్రజలపై రూ.లక్ష కోట్ల వరకు భారం పడకుండా నిలిచిపోయింది" అని పయ్యావుల వివరించారు.

Payyavula Keshav
Electricity
Chandrababu
Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News