Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో చీలిక.. సచిన్ పైలట్ వేరు కుంపటి?

Sachin Pilot to snap ties with Congress and likely to announce new party on June 11

  • ఈ నెల 11న కొత్త పార్టీని సచిన్ పైలట్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం
  • ‘ప్రోగ్రెసివ్ కాంగ్రెస్’, ‘రాజ్ జన సంఘర్ష పార్టీ’ పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు
  • నాలుగున్నరేళ్లుగా అశోక్ గెహ్లాట్ తో ప్రచ్ఛన్న యుద్ధం.. ఇటీవల సయోధ్య చేసిన హైకమాండ్
  • ఇంతలోనే కొత్త పార్టీ వైపు మొగ్గు చూపిన పైలట్!

మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీలో అసంత‌ృప్త నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సొంత కుంపటి పెట్టుకోవడానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుని, ఈ నెల 11న కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 

గత ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సచిన్ పైలట్.. పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. తీరా సీఎం పదవిని అశోక్ గెహ్లాట్ కు కట్టబెట్టడంతో అప్పటి నుంచి అంసతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో దాదాపు నాలుగున్నరేళ్లుగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

గతంలో కొందరు ఎమ్మెల్యేలతోపాటు చీలిక తెచ్చేందుకు ప్రయత్నించి.. తర్వాత వెనక్కి తగ్గారు సచిన్ పైలట్. ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వారిద్దరినీ పిలిపించి.. సయోధ్య చేసి పంపింది. అంతా సద్దుమణిగిందని అనుకునే లోపు.. సచిన్ పైలట్ బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. 

ఈ ఏడాది డిసెంబర్ లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న క్రమంలో సచిన్ పైలట్ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు విఫలమై.. కొత్త పార్టీ పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ‘ప్రోగ్రెసివ్ కాంగ్రెస్’ లేదా ‘రాజ్ జన సంఘర్ష పార్టీ’ అనే పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే ఈ పేర్లను రిజిస్టర్ చేయించారని సమాచారం.  

జూన్ 11వ తేదీని సచిన్ పైలట్ ఎంచుకోవడానికి ఓ కారణముంది. ఆ రోజు తన తండ్రి రాజేశ్ పైలెట్ వర్ధింతి. ఏటా ఆ రోజు తన అభిమానులతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగానే కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు సచిన్ పైలెట్ వర్గం నుంచి సమాచారం వస్తోంది.

Sachin Pilot
Ashok Gehlot
Rajasthan
Congress
New Party
June 11
  • Loading...

More Telugu News