Odisha: ఒడిశా రైలు ప్రమాదం.. రంగంలోకి దిగిన సీబీఐ!

cbi takes over probe on odisha train tragedy

  • బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి 10 మంది సీబీఐ అధికారుల బృందం
  • రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాల పరిశీలన
  • ఒడిశా పోలీసుల కేసును తమ చేతుల్లోకి తీసుకోనున్న సీబీఐ

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ రోజు ఉదయం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుంది. ఘటనకు కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను అధికారులు పరిశీలించారు.

ప్రమాదంపై ఒడిశా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీబీఐ అధికారులు ఒడిశా పోలీసుల నుంచి ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకోనున్నారు.

మరోవైపు రైలు ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు అధికారులు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేశారు.

సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేశారా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్‌ లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గత శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది చనిపోయారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు.

Odisha
Train Tragedy
CBI
(Odisha Police
Train Accident
probe
  • Loading...

More Telugu News