Khammam: పెట్రోలు పోసుకుని ఖమ్మంలో వరంగల్ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Warangal Dental Student Committed Suicide In Khammam

  • ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మానస
  • బంకు నుంచి పెట్రోలు కొనుక్కుని వచ్చిన విద్యార్థి
  • తండ్రి మరణం బాధ నుంచి కోలుకోలేకే ఆత్మహత్య?

ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిన్న సాయంత్రం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌కు చెందిన సముద్రాల మానస (22) ఖమ్మంలో బీడీఎస్ చదువుతూ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. 

నిన్న సాయంత్రం కాలుతున్న వాసన వస్తుండడంతో నిర్వాహకులు, తోటి విద్యార్థులు వచ్చి చూడగా ఆమె గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

ఓ పెట్రోలు బంకు నుంచి మానస పెట్రోలు కొనుక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మానస తండ్రి ఇటీవలే మరణించారు. ఆ బాధ నుంచి ఆమె కోలుకోలేకపోయిందని, తరచూ తండ్రిని తలచుకుని బాధపడేదని తెలుస్తోంది. మానసది ఆత్మహత్యేనని భావిస్తున్నామని, ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.

Khammam
Warangal
Dental Student
  • Loading...

More Telugu News