IPL Trophy: ఐపీఎల్ ట్రోఫీ అంబటి రాయుడు అందుకోవడం వెనుక కారణం ఇదే!

  • ట్రోఫీని తీసుకోవాలని ముందే కోరిన ధోనీ
  • చెన్నై జట్టుకు చేసిన సేవలకు తగిన గౌరవం
  • రాయుడు గొప్పతనాన్ని వెల్లడించిన స్టీఫెన్ ఫ్లెమింగ్
Rayudu reveals reason behind Dhoni king sized IPL Trophy gesture

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ గొప్ప సారథి ఎందుకు అయ్యాడో మరోసారి ఆ జట్టు సభ్యుడు, ఐపీఎల్ కు తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు మాటల రూపంలో మరోసారి తెలిసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ముందు తనకు ఇదే చివరి మ్యాచ్ అని, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు అంబటి రాయుడు ప్రకటన చేశాడు. 

ఐపీఎల్ విజేతగా చెన్నై జట్టు నిలవడంతో ట్రోఫీని కెప్టెన్ ధోనీ అందుకోలేదు. రవీంద్ర జడేజా, అంబటి రాయుడు కలసి స్వీకరించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవానికి అంబటి రాయుడు, రవీంద్ర జడేజాని కూడా వేదికపైకి రావాలని ధోనీ ముందే కోరినట్టు రాయుడు వెల్లడించాడు. ‘‘ట్రోఫీ ప్రదానోత్సవ వేడుక ముందు నన్ను, జడ్డూని (జడేజా) ధోనీ పిలిచాడు. ట్రోఫీని తీసుకునే కార్యక్రమంలో భాగం కావాలని కోరాడు. మా ఇద్దరితో కలసి ట్రోఫీని తీసుకోవడం సరైనదని ధోనీ భావించాడు. ఇది నిజంగా ధోనీ ప్రత్యేకత. అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ధోనీ అంటే అంతే మరి’’ అని రాయుడు వెల్లడించాడు. 

రాయుడు అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు లోగడే గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు ఐపీఎల్ కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. పైగా చెన్నై ట్రోఫీని గెలవడంలో రాయుడు పాత్ర కూడా కీలకంగానే పనిచేసింది. ఎందుకంటే కేవలం 8 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. జట్టుకు అది కీలక బూస్ట్ గా పనిచేసింది. అంతకాలం తనతో పాటు కలసి పనిచేసిన సహచరుడు, గొప్ప బ్యాటర్ అయిన రాయుడికి ఆ గౌరవం ఇవ్వాలని ధోనీ భావించడం వల్లే అలా జరిగింది. 

అంతేకాదు రాయుడు ఎంత గొప్ప ఆటగాడో సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం వివరించాడు. ‘‘అంబటి రాయుడు నిజంగా దిగ్గజం. బ్యాటర్ గా అతడికి నేను ఎక్కువ రేటింగ్ ఇస్తాను. మోహిత్ శర్మ బౌలింగ్ లో మూడు బంతులను 6, 4, 6గా గొప్పగా ఆడాడు. రాయుడు లేకపోవడం లోటే. అందులో సందేహం లేదు’’ అని ఫ్లెమింగ్ వివరించాడు.

More Telugu News