Raghu Rama Krishna Raju: శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వెనక అసలు కథ ఇదీ: రఘురామకృష్ణ రాజు

  • వివేకా హత్యకేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా ఉండేందుకేనన్న రఘురామరాజు
  • మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్టు ‘సాక్షి’లో రాశారన్న నరసాపురం ఎంపీ
  • కేసీఆర్‌ను జగన్ మోసం చేస్తున్నారని ఆవేదన
Raghuramaa Krishna Raju Sensational Comments On Jagan

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం వెనక పెద్ద కథే ఉందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మద్యం కేసులో కొందరి పాత్రను బయటపెడితే ప్రతిగా వివేకా హత్యకేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా చూస్తామని కొందరు చెప్పినట్టు వార్తలు వచ్చాయని అన్నారు. ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్టు సాక్షి దినపత్రికలో వార్త వచ్చిందని గుర్తు చేశారు. ఆ వెంటనే జగన్‌కు అత్యంత సన్నిహితుడైన శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారని అన్నారు. 

ఆయన అప్రూవర్‌గా మారబోతున్నట్టు రెండు రోజుల క్రితమే పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఇప్పుడది నిజమైందని అన్నారు. శరత్‌చంద్రారెడ్డి కొన్ని పేర్లు బయటపెడితే వివేకానందరెడ్డి హత్యకేసులోని కుట్రకోణం నుంచి ఓ కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా చేస్తామని చెప్పినట్టుగా వస్తున్న వార్తలను ఇప్పుడు నమ్మాల్సి వస్తోందన్నారు. 

ఇదంతా చూస్తుంటే కేసీఆర్‌ను జగన్ మోసగిస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు సాయం చేసిన కేసీఆర్‌కు జగన్ ద్రోహం చేస్తుండడం బాధగా ఉందన్నారు. అప్రూవర్‌గా మారిన శతర్‌చంద్రారెడ్డి ఇప్పుడు ఎవరెవరి పేర్లు చెబుతారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందేనని రఘురామరాజు అన్నారు.

More Telugu News