Bihar: ‘ది కేరళ స్టోరీ’ ఎఫెక్ట్.. మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై వర్ధమాన మోడల్ పోలీసులకు ఫిర్యాదు

Model accuses man of conversion bid fir lodged
  • మతం మారాలని ఒత్తిడి తెచ్చాడంటూ మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై  బీహార్‌కు చెందిన యువ మోడల్ ఆరోపణ 
  • తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు
  • ‘ది కేరళ స్టోరీ’ చూశాకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యానన్న యువతి
  • మోడల్ ఆరోపణలను ఖండించిన మాజీ బాయ్‌ఫ్రెండ్
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఓ వర్ధమాన మోడల్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడు ఒత్తిడి చేశాడని తెలిపింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా ఆరోపించింది. 

మోడల్‌ అవ్వాలన్న కోరికతో బీహార్‌కు చెందిన మాన్వీ 2020లో రాంచీలోని యశ్ మోడలింగ్ ఏజెన్సీలో చేరింది. ఈ క్రమంలోనే సంస్థ యజమానితో ఆమెకు పరిచయం పెరిగింది. సంస్థ యజమాని తనని తాను యశ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆమెకు యశ్ అసలు పేరు తన్వీర్ అఖ్తర్ అని తెలిసింది. ఈ క్రమంలోనే అతడు తనను మతం మారి పెళ్లిచేసుకోమని బలవంతం చేసేవాడని ఆరోపించింది. తను అతడితో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించేవాడని ఆరోపించింది. 

అయితే, మాన్వీ ఆరోపణలను తన్వీర్ ఖండించారు. తన నగ్న చిత్రాలను స్నేహితులు, బంధువులకు మాన్వీయే పంపించిందని వాపోయాడు. తన ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని ఆమె దొంగిలించాలని ప్రయత్నించినట్టు ఆరోపించాడు. తామిద్దరం కలిసి ఉండాలని కోరుకున్నానని, ఆమెకు హాని తలపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. యువతి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Bihar

More Telugu News