Kanna Lakshminarayana: సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా... చంద్రబాబు ఆదేశాలు

TDP appoints Kanna Lakshmi Narayana as Sattenapalle constituency incharge

  • మంత్రి అంబటిపై సత్తెనపల్లి బరిలో కన్నా!
  • టీడీపీ ఇన్చార్జిగా నియమిస్తూ ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు
  • ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కన్నా 

సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ అభ్యర్థి ఎవరన్నది తేలింది. కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ అధినాయకత్వం సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి అంబటికి దీటైన అభ్యర్థి కన్నానే అని టీడీపీ భావిస్తున్నట్టు దీంతో స్పష్టమైంది. 

కన్నా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండడంతో, ఇప్పటికే పాక్షికంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీ... నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిల నియామకంలోనూ దూకుడు పెంచింది. 

కాగా, సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రేసులో జీవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే, టీడీపీ నాయకత్వం కన్నా వైపు మొగ్గడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

Kanna Lakshminarayana
TDP Incharge
Sattenapalle
Palnadu District
Andhra Pradesh
  • Loading...

More Telugu News