Sajjala Ramakrishna Reddy: ఎన్నికలు వస్తున్నాయని గుంటనక్కలు నిద్ర లేచాయి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • నాలుగేళ్ల పాలనలో జగన్ అద్భుతాలు చేశారన్న సజ్జల
  • చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని ఎద్దేవా
  • వైనాట్ 175ని నిజం చేసేందుకు వైసీపీ శ్రేణులు కష్టపడాలని పిలుపు
Sajjala Ramakrishna Reddy fires on Chandrababu

ముఖ్యమంత్రిగా జగన్ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... నాలుగేళ్ల పాలనలో జగన్ అద్భుతాలు చేశారని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. జగన్ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. 

వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని... దీంతో గుంటనక్కలు మళ్లీ నిద్ర లేచాయని సజ్జల విమర్శించారు. కొత్త హామీలతో చంద్రబాబు పగటి వేషాలు వేస్తున్నారని... రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసేందుకు ఇంకో అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని ఎద్దేవా చేశారు. 

చెప్పుకోవడానికి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని సజ్జల అన్నారు. చంద్రబాబును మోసేందుకు ప్యాకేజ్ తీసుకున్న దత్తపుత్రుడు ఉన్నాడని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వైనాట్ 175ను నిజం చేసేందుకు వైసీపీ శ్రేణులు కష్టపడాలని చెప్పారు. గుంట నక్కల ఎత్తులను ప్రజలకు వివరించాలని సూచించారు.

More Telugu News