Kerala: 50 లక్షలతో మినీ కూపర్ వాహనం కొనుగోలు.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా కేరళ కమ్యూనిస్ట్ నేత

Kerala communist leader PK Anik Kumar is talk of town after buying Rs 50 lakh Mini Cooper

  • కూపర్ వాహనం పక్కన నిల్చుని ఫొటోలు తీసుకున్న అనిల్ కుమార్
  • పెట్టుబడిదారులు ఎలా జీవిస్తారో అధ్యయనం చేసేందుకే అయి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ ఎద్దేవా
  • కారు తన భార్యదన్న కమ్యూనిస్ట్ నేత

కమ్యూనిస్టు నేతలు ఎంత సాధారణ జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కోసం పోరాటాలు చేస్తుంటారు. ఇతర పార్టీల నాయకుల్లా వారు ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోరు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా, లేకున్నా వారికి గౌరవం దక్కేది అందుకే. అయితే, కేరళకు చెందిన కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్ నేత పీకే అనిల్ కుమార్ ఏకంగా రూ. 50 లక్షలు పోసి మినీ కూపర్ వాహనం కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జెస్టీ ఎల్లో కూపర్ ఎస్ వాహనం పక్కన నిల్చుని తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అనిల్ కుమార్ పెట్రోలియం అండ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

మినీ కూపర్ కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడిదారులు ఎలా జీవిస్తారో అధ్యయనం చేయాలని అనిల్ కుమార్ భావిస్తున్నట్టు ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఎద్దేవా చేశారు. కామ్రేడ్ కొడియెరి బాలకృష్ణన్ కూడా ఇలాంటి అధ్యయనం ఒకటి చేశారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. కొడియెరి కూడా అధికార సీపీఎం పార్టీ నేతే. 2017లో ఆయన కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు.

బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడికి చెందిన ఎరుపురంగు మినీ కూపర్ వాహనంలో ఆయన ప్రచారం చేశారు. కామ్రేడ్లు అందరూ కూపర్లపై ఎందుకు మనసు పారేసుకుంటున్నారని ఓ ఫేస్‌బుక్ యూజర్ ప్రశ్నించాడు. తన భార్య ఉద్యోగం చేస్తుందని చెప్పడం ద్వారా దీని నుంచి ఆయన ఎలా తప్పించుకోగలరని నిలదీశారు. కాగా, తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన అనిల్ కుమార్ ఆ కారు తనది కాదని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న తన భార్య దానిని కొనుగోలు చేసిందని వివరణ ఇచ్చారు. 

అనిల్ కుమార్‌కు వివాదాలు కొత్తకాదు. గతంలో ఓ మహిళా వ్యాపారవేత్తను కులం పేరుతో దూషించి వివాదంలో చిక్కుకున్నారు. కాగా, అనిల్ కుమార్ కూపర్ కారు కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ ఈ విషయంపై దృష్టి సారిస్తామని ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

Kerala
Communist
PK Anik Kumar
Mini Cooper
  • Loading...

More Telugu News