Rajasthan: వచ్చే ఎన్నికల్లో కలిసి ఫైట్ చేసేందుకు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ అంగీకారం

Ashok Gehlot and Sachin Pilot agree to fight Rajasthan polls unitedly

  • గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న గెహ్లాట్, సచిన్ పైలట్
  • ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన అధిష్ఠానం
  • సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జితేంత్ర సింగ్
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న వేణుగోపాల్

ఎడమొహం పెడమొహంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిరింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ఫైట్ చేసేందుకు అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో నిన్న ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ పాల్గొన్నారు. వీరిద్దరూ ముఖాముఖి కలుసుకోవడం చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి. 

రాజస్థాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఇద్దరి మధ్య నెలకొన్న పొరపొచ్చాలను తొలగించేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు వీరిద్దరూ అంగీకరించారు. ఈ సమావేశంలో వీరిద్దరితోపాటు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ నేత జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 

సమావేశం అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాము కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని, రాజస్థాన్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి తీరుతామని పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు. కాగా, తాను లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతానని సచిన్ పైలట్ ఇటీవల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడీ సమావేశం తర్వాత సీఎం గెహ్లాట్‌కు, ఆయనకు మధ్య సయోధ్య కుదరడంతో ఆ డిమాండ్లకు ఎండ్ కార్డు పడినట్టే.

Rajasthan
Ashok Gehlot
Sachin Pilot
Congress
  • Loading...

More Telugu News