IAF: మధ్యప్రదేశ్ లో పొలాల్లో దిగిన వాయుసేన హెలికాఫ్టర్.. వీడియో ఇదిగో!

IAF Apache Helicopter made emergency landing In Madhya Pradesh
  • సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్
  • శిక్షణ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన
  • సాయంగా మరో హెలికాఫ్టర్ ను పంపిన అధికారులు 
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ మధ్యప్రదేశ్ లోని బింధ్ దగ్గర్లోని పొలాల్లో దిగింది. హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారని వాయుసేన ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పైలట్ శిక్షణలో భాగంగా సోమవారం ఉదయం బయలుదేరిన అపాచీ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. పైలట్ క్షేమంగా ఉన్నారని, మరమ్మతులు నిర్వహించి హెలికాఫ్టర్ ను వెనక్కి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా మరో హెలికాఫ్టర్ ను సాయం కోసం ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు.

పొలాల్లో దిగిన హెలికాఫ్టర్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటీవలి కాలంలో వాయుసేనలో ఉపయోగిస్తున్న హెలికాఫ్టర్లు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో ధ్రువ్ హెలికాఫ్టర్ జమ్మూకశ్మీర్ లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా హెలికాఫ్టర్ కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ అక్కడికక్కడే చనిపోయారు. పైలట్లు ఇద్దరూ గాయపడ్డారు. మార్చిలో అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
IAF
Helicopter
Apache
emergency landing
Madhya Pradesh

More Telugu News