car accident: మందులు కొనుక్కుని తిరిగి వెళ్తున్న వ్యక్తి పై నుంచి దూసుకెళ్లిన కారు.. ఢిల్లీలో ఘోర ప్రమాదం

Speeding BMW Runs Over Delhi Man Out To Buy Medicines
  • బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన నిందితురాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బాధితుడు
  • మోతీ బాగ్ లో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం
మందులు తీసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ 28 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసాయ్ దారాపూర్ లో నివాసం ఉంటున్న అజయ్ గుప్తా ఆదివారం తెల్లవారుజామున మోతీ బాగ్ లోని ఓ మందుల దుకాణానికి వెళ్లాడు. మందులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు బైక్ తీస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి, అజయ్ పై నుంచి వెళ్లింది. దీంతో అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. 

యాక్సిడెంట్ కు కారణమైన కారు అశోక్ విహార్ కు చెందిన ఓ మహిళ (28) కు చెందినదని, ఆ సమయంలో కారును ఆమే నడుపుతోందని పోలీసులు చెప్పారు. గ్రేటర్ కైలాశ్ లో జరిగిన ఓ పార్టీకి హాజరైన నిందితురాలు.. ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వెంటనే స్పందించిన మహిళ.. అజయ్ గుప్తాను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించిందని చెప్పారు. అయితే, చికిత్స పొందుతూ అజయ్ చనిపోయారని వివరించారు. ప్రమాదానికి కారణమైన మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
car accident
moti bagh
Delhi
car run over
accident

More Telugu News