Pawan Kalyan: నేనేమీ సంపూర్ణ రైతును కాదు... అన్నీ తెలిసిన మీరేం చేస్తున్నారు?: పవన్ కల్యాణ్

  • ఇవాళ రాజమండ్రిలో రైతులతో సమావేశం
  • మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్
  • రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
  • రైతులను అనుచితంగా మాట్లాడడం బాధ కలిగించిందన్న పవన్
Pawan Kalyan press meet in Mangalagiri

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో రైతులతో ముఖాముఖి సమావేశం అనంతరం మంగళగిరి చేరుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దళారీ వ్యవస్థ రైతులను నాశనం చేస్తోందని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

తమకు ప్రభుత్వం సకాలంలో గోనె సంచులు అందించలేదని రైతులు వాపోయారని తెలిపారు. అధికారులు సహకరించి గోనె సంచులు ముందే ఇచ్చి ఉంటే బాగుండేదని రైతులు చెబుతున్నారని వివరించారు. నేను పర్యటనకు వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రి గోనె సంచులు అందించారు అని పవన్ ఆరోపించారు. సంక్షోభం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారే తప్ప, నివారణకు కృషి చేయలేకపోతున్నారని విమర్శించారు. ఓ రైతు వెల్లడించిన వివరాల మేరకు ఒక్కో ఎకరానికి రూ.8 వేల వరకు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. 

ఒక్క మంత్రి అయినా సహాయపడకపోగా, రైతులను అనుచిత మాటలు అనడం బాధ కలిగించిందని తెలిపారు. "మేం అన్నం పెడుతున్నాం... మాకేంటి ఈ బాధలు?... మేం ఏమైనా క్రిమినల్స్ లా కనిపిస్తున్నామా? అని రైతులు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసులకు వెళ్లి రైతులు తమ గోడు వెళ్లబోసుకునే పరిస్థితి లేదు. వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడికో తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడుతున్నారు. 

ఈ సందర్భంగా రైతులు మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. సరిగ్గా వ్యవసాయ పనులు వచ్చిన సమయంలోనే ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభిస్తున్నారు. దాంతో కూలీలు అందరూ ఉపాధి హామీ పనికి వెళ్లిపోవడంతో తమకు కూలీలు దొరకడంలేదని రైతులు వాపోతున్నారు. పంట కోసే సమయానికి కూలీలు, యంత్రాలు అందుబాటులో లేకుండా పోయాయని చెబుతున్నారు. 

పొలాల్లో నీటి పారుదల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మా డబ్బును వైసీపీ ప్రభుత్వం వారి పథకాలకు ఇచ్చుకుంటోంది అని రైతులు మండిపడుతున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేసినా తీసుకునే పరిస్థితి లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ నిరుపయోగంగా మారింది. 

వ్యవసాయ రంగానికి కీలకంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే రాజమండ్రిలో కార్యాలయం స్థాపించడం జరిగింది. ఇవాళ ఆ కార్యాలయంలోనే పాతికమంది రైతులతో సమావేశం అయ్యాం" అని పవన్ కల్యాణ్ వివరించారు. 

తాను సంపూర్ణ రైతును కానని, వ్యవసాయం గురించి, వరి రకాల గురించి కొంత మాత్రమే తెలుసని అన్నారు. అయితే తాను మానవతా వాదినని, ఒకరికి నష్టం వస్తోందంటే, అది ఎందుకు వస్తోందని దానిపై అధ్యయనం చేయగలిగిన ఆసక్తి, శక్తి ఉన్నవాడ్ని అని స్పష్టం చేశారు. 

తానేమీ వ్యవసాయంలో నిపుణుడ్ని కాదని, కానీ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రభుత్వ పెద్దలు రైతులను ఇలా ఎందుకు ఏడిపిస్తున్నారని వ్యవసాయ మంత్రి కాకాణి వ్యాఖ్యలకు పవన్ ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. పది రకాల పంటలు చూపిస్తే వాటిలో ఐదు రకాల పంటల పేర్లు కూడా వీళ్లు చెప్పలేరని, వీళ్లు చేసేవి పాప పరిహార యాత్రలు అని మంత్రి కాకాణి విపక్షనేతలను ఎద్దేవా చేయడం తెలిసిందే. 

దీనిపై పవన్ స్పందిస్తూ, మరి 10 వరి రకాల గురించి తెలిసిన మంత్రి రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పమనండి అంటూ నిలదీశారు. తాము సమస్యలు లేని చోట సమస్యలు సృష్టించేవారం కాదని, సమస్య ఉంటే తాము తప్పక పోరాడతామని అన్నారు.

More Telugu News