Nara Lokesh: టీడీపీ వస్తే ఉద్యోగాల జాతరే... ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: నారా లోకేశ్

  • కర్నూలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • మసీదు, చర్చిలను సందర్శించిన లోకేశ్
  • ఆయా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు
  • విద్యార్థి సంఘ ప్రతినిధులతోనూ సమావేశం
  • ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ
Lokesh assures job recruitments

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో దుమ్మురేపింది. కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. తొలుత కర్నూలు బళ్లారి సర్కిల్ లో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. 

కర్నూలు 48వ డివిజన్ రోజా దర్గా వద్ద నారా లోకేశ్ ముస్లిం మతపెద్దలను కలిసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. రోజా దర్గాలోకి వెళ్లి మతపెద్దలకు అభివాదం చేసిన లోకేశ్ ను వారు ఆత్మీయంగా స్వాగతించారు. యువగళం పాదయాత్ర విజయవంతమయ్యేలా తనను ఆశీర్వదించాలని మతపెద్దలను లోకేశ్  కోరారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సీఎం కావాలని అల్లాను ప్రార్థించాల్సిందిగా మతపెద్దలను కోరారు. 

ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు యువనేతకు షాయా కప్పి ఫాతియా అందజేశారు. మసీదు నిర్వహణ, ముస్లిం సోదరులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై లోకేశ్ వారిని అడిగి తెలుసుకున్నారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక మసీదులు, దర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. చాలాచోట్ల ఖబరిస్తాన్ లు (శ్మశానాలు)  ఆక్రమణలకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, రక్షణ గోడలు ఏర్పాటుచేసి వాటిని పరిరక్షిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 

దారిపొడవునా నిరుద్యోగ యువకులు, దివ్యాంగులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గీయులు, మైనారిటీలు, వివిధ బస్తీల వాసులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 43వ వార్డులో పేదలు నివసించే కాలనీలోకి వెళ్లిన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

కర్నూలు శ్రీనివాసనగర్ లోని స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా చర్చిలోకి వెళ్లిన లోకేశ్ కు క్రిస్టియన్ మత పెద్దలు సాదరంగా ఆహ్వానం పలికారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలంటూ మతపెద్దలు ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు.

అనంతరం లోకేశ్ మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో శ్మశాన వాటిక సమస్య ఉందని వారు తెలుపగా, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

నిస్సహాయుల ఉసురు పోసుకోవ‌డం పాపం జ‌గ‌న్ రెడ్డీ!

భగత్ సింగ్ నగర్ లో పెన్షన్లు తొలగించిన శాంతమ్మ, దేవసహాయం యువనేత లోకేశ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందించారు.

"ఒక‌రేమో వృద్ధుడు... మ‌రొక‌రేమో దివ్యాంగురాలు. ఇద్దరూ నిస్సహాయులు... వీళ్ల బ‌తుకుకి ఆస‌రా అయిన పింఛ‌ను తీసేయ‌డానికి మ‌న‌సు ఎలా ఒప్పింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డీ? క‌ర్నూలు టౌన్‌లో ఈ నిస్సహాయులు న‌న్ను క‌లిసి త‌మ ఆవేద‌న వెళ్లగ‌క్కారు. పింఛ‌ను ప‌థ‌కానికి నీ తండ్రి పేరు పెట్టుకుని ల‌క్షలాది మంది వృద్ధులు దివ్యాంగులు, వితంతువుల పింఛ‌న్లు తీసేసి ఉసురు పోసుకోవ‌డం పాపం అనిపించ‌డం లేదా?" అంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ ను కలిసిన విద్యార్థి సంఘ ప్రతినిధులు

కర్నూలు అశోక్ నగర్ లో తెలుగు విద్యార్థి సంఘ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జీవో నెం. 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

"ఎయిడెడ్ విద్యా వ్యవస్థను పునరుద్ధరించి, పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెచ్చి విద్యా కానుక, యూనిఫామ్ ను పూర్తి స్థాయిలో అందరికీ అందించాలి. పాఠశాల విలీన ప్రక్రియకు సంబంధించి జీవోలు 84, 85, 117, 128ని రద్దు చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతోపాటు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. 

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.3లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలి. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేయాలి" అని తమ విజ్ఞప్తులను లోకేశ్ ముందుంచారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేవిధంగా తప్పుడు విధానాలను అవలంభిస్తున్నాడని విమర్శించారు. పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే జీవో 77ని రద్దుచేసి, పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 

"ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం పేరుతో భూముల్ని దోచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపర్చి, నాణ్యమైన విద్యను అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులన్నీ భర్తీచేస్తాం" అని భరోసా ఇచ్చారు.

దివ్యాంగ చర్మకారుడిని కలిసి కష్టాలు తెలుసుకున్న లోకేశ్

కర్నూలు బస్టాండు సమీపంలో చెప్పులు కుడుతున్న చర్మకారుడు నాగన్నను కలిసిన లోకేశ్, ఆయన కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చర్మకారుడు నాగన్న తన సమస్యలను, కుటుంబ పరిస్థితిని లోకేశ్ కు వివరించారు. దీనిపై లోకేశ్ స్పందించారు. 

"రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బతకడమే కష్టంగా మారింది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరిచారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసరాల ధరలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం. నాగన్న లాంటి పేద చర్మకారులకు సబ్సిడీ రుణాలను అందజేసి ఆదుకుంటాం. మరో ఏడాది ఓపిక పట్టండి... రాబోయే చంద్రన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని స్పష్టం చేశారు.

యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం – 1169.7 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం – 7.5 కి.మీ.

92వ రోజు (7-5-2023) యువగళం వివరాలు:

సాయంత్రం

4.00 – కర్నూలు ఎస్ టిబిసి గ్రౌండ్ లో మైనార్టీ సోదరులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేశ్ పాల్గొంటారు.

6.00 – కర్నూలు ఎస్ టిబిసి గ్రౌండ్స్ విడిది కేంద్రంలో బస.

****More Telugu News