Kerala Story: మసీదులో హిందూ వివాహం.. వీడియో షేర్ చేసిన ఏఆర్ రెహమాన్

Ahead of The Kerala Story release AR Rahman shares video of Hindu wedding in mosque

  • మానవత్వంపై ప్రేమ షరతుల్లేకుండా ఉండాలన్న సంగీత దర్శకుడు
  • కేరళలోని అలప్పుజలో ఓ మసీదులో హిందూ వివాహ వేడుక
  • వధువు తల్లిదండ్రులు పేదవారు కావడంతో మసీదు సాయం

కేరళ స్టోరీస్ సినిమా 5వ తేదీన విడుదల అవుతుండగా, దీనికి ఒక రోజు ముందు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. మత సామరస్యానికి నిదర్శనంగా ఒక వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. కేరళలోని అలప్పుజలో ఓ మసీదు లోపల హిందూ సంప్రదాయ విధానంలో పెళ్లి వేడుక నిర్వహిస్తున్న వీడియో ఇది. మానవత్వంపై ప్రేమ ఎలాంటి షరతులు లేకుండా ఉండాలన్న అభిప్రాయాన్ని రెహమాన్ వ్యక్తం చేశారు. కామ్రేడ్ ఫ్రమ్ కేరళ పేరుతో ఓ యూజర్ ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఇది మరొక కేరళ స్టోరీ అన్న క్యాప్షన్ పెట్టారు. దీన్ని చూసిన ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు.

అంజు, శరత్ పెళ్లి వేడుక అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాయత్ మసీదులో జరగడంతో గత కొన్ని రోజులుగా ఇది చర్చనీయాంశంగా మారింది. అంజు తల్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఆమె మసీదు నిర్వాహకులను సంప్రదించింది. దీంతో మసీదులోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అంతేకాదు 10 సవర్ల బంగారం, రూ.20 లక్షల నగదు బహుమతి కూడా ఇచ్చారు. వివాహం తర్వాత మసీదు వద్దే 1000 మందికి శాకాహార విందు ఏర్పాటు చేశారు. మతం పేరుతో ప్రజలను చంపుతున్న వేళ కేరళతోపాటు దేశం మొత్తానికి తాము ఇచ్చే ప్రేమ సందేశం ఇదేనని మసీదు నిర్వాహకులు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుంచితే, కేరళ స్టోరీస్ సినిమాలో.. కేరళకు చెందిన కొంత మంది మహిళలు ఇస్లాంలోకి మారి ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలసి పనిచేయడం చూపించారు.

  • Loading...

More Telugu News