Real Estate: ఏప్రిల్ నెలలో హైదరాబాదులో రూ.2,230 కోట్ల మేర ఇళ్ల కొనుగోళ్లు

Hyderabad real estate data for April 2023 by Knight Frank India

  • హైదరాబాదులో నిలకడగా రియల్ ఎస్టేట్ వృద్ధి
  • గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏప్రిల్ లో స్వల్ప క్షీణత
  • 2023 ఏప్రిల్ లో 4,398 గృహ రిజిస్ట్రేషన్లు
  • అందులో 54 శాతం రూ.25 లక్షలు-రూ.50 లక్షల ధరల శ్రేణి కలిగిన ఇళ్లే!

హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిలకడగా కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో రూ.2,230 కోట్ల మేర ఇళ్ల కొనుగోళ్లు జరిగాయి. మొత్తం 4,398 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. 

అయితే గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏప్రిల్ మాసంలో ఇళ్ల కొనుగోళ్లు స్వల్పంగా తగ్గినట్టే భావించాలి. 2021 ఏప్రిల్ లో ఇళ్ల కొనుగోళ్ల విలువ రూ.2,527 కోట్లు కాగా, 2022 ఏప్రిల్ లో రూ.2,784 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. 2021 ఏప్రిల్ లో 5,903 యూనిట్లు, 2022 ఏప్రిల్ లో 5,366 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. 

ఈ ఏడాది ఏప్రిల్ లో మొత్తం రిజిస్ట్రేషన్లలో 54 శాతం రూ.25 లక్షలు-రూ.50 లక్షల ధరల శ్రేణిలో ఉన్న గృహాలే. అమ్ముడైన వాటిలో 69 శాతం గృహాలు 1000 నుంచి 2000 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లేనని నైట్ ఫ్రాంక్ ఇండియా వివరించింది. 

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గృహ రిజిస్ట్రేషన్లను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.

Real Estate
Residential Houses
Sales
Registrations
Hyderabad
Knight Frank India
  • Loading...

More Telugu News