Coal India: కోల్ ఇండియా తదుపరి సీఎండీగా పోలవరపు మల్లికార్జున ప్రసాద్

Polavarapu Mallikharjuna Prasad to be next Coal India chief

  • ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి
  • సీఐఎల్ అనుబంధ సంస్థలైన సీసీఎల్, బీసీసీఎల్ రెండింటిలోనూ సీఎండీగా సేవలు
  • మైనింగ్ రంగంలో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం 
  • హింగులా ఓపెన్ కాస్ట్‌ను అన్‌లాక్ చేయించిన ఘనత
  • జులై 1న కోల్ ఇండియా సీఎండీ బాధ్యతల స్వీకరణ

దేశంలోని అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన ‘కోల్ ఇండియా’ తదుపరి సీఎండీగా తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వరంగ సంస్థల సెలక్షన్ బోర్డు పీఎస్‌ఈబీ సిఫార్సు చేసింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రసాద్ 1 సెప్టెంబరు 2020లో సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. 

ఈ రంగంలో ఆయనకు మూడు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. హింగులా ఓపెన్ కాస్ట్‌లో ఉన్న 26 మిలియన్ టన్నుల బొగ్గు నల్లా కారణంగా నిలిచిపోతే దానిని డైవర్ట్ చేసి ఓపెన్ కాస్ట్‌‌ను అన్‌లాక్ చేయించిన ఘనత ఆయన సొంతం. అలాగే, తాల్చేర్ కోల్‌ఫీల్డ్స్‌కు కొత్త రైల్వే సైడింగును కూడా వేయించి ప్రశంసలు అందుకున్నారు.

కోల్ ఇండియా అనుబంధ సంస్థలైన సీసీఎల్, భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) రెండింటికీ ప్రసాద్ సీఎండీగా సేవలు అందించారు. కాగా, కోల్ ఇండియాకు ప్రస్తుతం సీఎండీగా ఉన్న ప్రమోద్ అగర్వాల్ పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జులై 1న ప్రసాద్ సీఐఎల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరిస్తారు. 

మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియాలో మొత్తం 2,48,550 పనిచేస్తున్నారు. కోల్ ఇండియాకు మొత్తం 8 రాష్ట్రాల్లో 84 మైనింగ్ ప్రాంతాలున్నాయి. 1 ఏప్రిల్ 2022 నాటికి సీఐఎల్‌కు 318 గనులున్నాయి. ఇందులో 141 అండర్ గ్రౌండ్ కాగా 158 ఓపెన్ కాస్ట్ గనులు. 19 మిశ్రమ గనులున్నాయి. కోల్ ఇండియాకు 10 అనుబంధ సంస్థలున్నాయి.  దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బొగ్గులో 82 శాతం సీఐఎల్ అందిస్తోంది. సంస్థ మొత్తం ఆదాయం రూ. 1,13,618 కోట్లు కాగా, రూ. 1,80,243 ఆస్తులున్నాయి.

జియాలాజికల్ అండ్ మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గానూ ఉన్న ప్రసాద్‌ గనుల తవ్వకాల సమయంలో తీసుకున్న భద్రతా ప్రమాణాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అవార్డులు అందుకున్నారు.

Coal India
CCL
BCCL
Polavarapu Mallikharjuna Prasad
Hyderabad
  • Loading...

More Telugu News