Pawan Kalyan: ఐపీఎల్ లో మన గుంటూరు కుర్రాడు రషీద్ పట్టిన క్యాచ్ అద్భుతం: పవన్ కల్యాణ్

Pawan Kalyan lauds Guntur cricketer Shaikh Rasheed for a stunning catch in IPL

  • జూనియర్ క్రికెట్లో చిచ్చరపిడుగు అనిపించుకున్న షేక్ రషీద్
  • రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా తిక్కారెడ్డిపాలెం
  • ఐపీఎల్ లో రషీద్ ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ గా ఫీల్డింగ్
  • స్టన్నింగ్ క్యాచ్ పట్టిన వైనం
  • రషీద్ క్యాచ్ సంభ్రమాశ్చర్యాలు కలిగించిందన్న పవన్ కల్యాణ్

జూనియర్ క్రికెట్లో పరుగుల మోత మోగించిన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ ను ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ గా ఫీల్డింగ్ చేసిన రషీద్... ఓ అద్భుత క్యాచ్ తో అందరినీ ఔరా అనిపించాడు. 

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఎంతో నేర్పుగా క్యాచ్ పట్టాడు. అతడి కాలు బౌండరీ లైన్ కు తాకినట్టే అనిపించినా, సెంటీమీటర్ గ్యాప్ తో లైన్ కు తగలకుండా కాలును వెనక్కి లాక్కున్న వైనం రీప్లేలో కనిపించింది. ఆ మ్యాచ్ లో రషీద్ క్యాచ్ పట్టిన తీరు ప్రత్యర్థి టీమ్ పంజాబ్ కింగ్స్ ను ఆకట్టుకుంది. ఆ జట్టు ఆటగాళ్లు కూడా రషీద్ ను అభినందించకుండా ఉండలేకపోయారు. 

కాగా, రషీద్ పట్టిన ఈ క్యాచ్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను సైతం విస్మయానికి గురిచేసింది. ఆయన ఏకంగా రషీద్ ను అభినందిస్తూ ఓ ప్రకటన చేశారు. తెలుగు యువకుడు రషీద్ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు తెలుగువారే కాకుండా యావత్ దేశం గర్వించేలా ఉందని కొనియాడారు. 

ఐపీఎల్ మ్యాచ్ లో రషీద్ పట్టిన క్యాచ్ అతనిలోని ప్రతిభాపాటవ ప్రదర్శనకు మరో మెట్టుగా గోచరిస్తోందని వివరించారు. ఆ క్యాచ్ క్రీడాభిమానులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన రషీద్ ఏపీ అండర్-14, 16, 19 జట్లకు కెప్టెన్ గా వ్యవహరించాడంటే అతని ప్రతిభను అంచనా వేయొచ్చని తెలిపారు. 

రెండేళ్ల కిందట అండర్-19 వరల్డ్ కప్ లో మన దేశ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించి సెమీఫైనల్స్ లో 90 పరుగులు చేసి జట్టు విజయానికి కారకుడయ్యాడని పవన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్న రషీద్... మణికట్టు విన్యాసాలతో బ్యాటింగ్ చేయడంలో స్పెషలిస్ట్ అని క్రికెట్లో నైపుణ్యం ఉన్నవారు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించిందని వివరించారు. 

రషీద్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని... ఆంధ్రప్రదేశ్ కు, మనదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానని తెలిపారు. అతడిని తెలుగువారంతా ఆశీర్వదించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

Pawan Kalyan
Shaikh Rasheed
Catch
IPL
CSK
Punjab Kings
Guntur District
Andhra Pradesh
Janasena
  • Loading...

More Telugu News