Mahatma Gandhi: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ కన్నుమూత

Mahatma Gandhi grandson Arun Manilal Gandhi passes away

  • కోల్హాపూర్ లోని అవనీ సంస్థాన్ లో బస చేసిన మణిలాల్ గాంధీ
  • ఫ్లూ లక్షణాలతో అనారోగ్యం బారిన పడగా, ఆసుపత్రిలో చికిత్స
  • ప్రయాణం వద్దంటూ వైద్యుల సూచనతో అక్కడే ఉండిపోయిన మణిలాల్

జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఫిబ్రవరి 28న కోల్హాపూర్ కు వచ్చిన ఆయన అవనీ సంస్థాన్ లో బస చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థను అనురాధా భోస్లే నిర్వహిస్తున్నారు. గడిచిన 24 ఏళ్లుగా అరుణ్ మణిలాల్ ఇక్కడి అవని సంస్థాన్ ను సందర్శించడం అలవాటు. పది రోజుల పర్యటనకు వచ్చిన ఆయన అనారోగ్యం కారణంగా కోల్హాపూర్ లోనే ఉండిపోయినట్ట భోస్లే తెలిపారు. 

సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండడంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్ లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. నయం కావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. దాంతో తిరిగి అవనీ సంస్థాన్ కు వచ్చేశారని, ఈ సమయంలో ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్టు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నామని, అన్నింటికంటే రాష్ట్రం, దేశాన్ని ఎక్కువగా ప్రేమించాలని బాలికలకు మణిలాల్ సూచించినట్టు భోస్లే వివరించారు. రాత్రి వరకు రాసుకుంటూ, ఆ తర్వాత నిద్రించిన మణిలాల్, ఉదయం చూసేసరికి మరణించి ఉన్నారని వెల్లడించారు. 

గత రెండున్నర దశాబ్దాలుగా మణిలాల్ తో భాగస్వామ్యం ఉందంటూ, కోల్హాపూర్ కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అవనీ సంస్థాన్ లోనే బస చేసేవారని భోస్లే తెలిపారు. మహాత్మాగాంధీ గుర్తులుగా సేకరించిన ఫొటోలతో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారని.. ఆయన లేనందున, ఇప్పుడు ఆయన కోరిక మేరకు తాము ఆ పని చేస్తామని ప్రకటించారు. వాషి నంద్వాల్ లో గాంధీ మిషన్ కు చెందిన స్థలంలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అరుణ్ మణిలాల్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల కోసం కోల్హాపూర్ బయల్దేరి వెళ్లారు. వాషి నంద్వాల్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Mahatma Gandhi
grandson
Arun Manilal Gandhi
passes away
kolhapur
  • Loading...

More Telugu News