Nimmala Ramanaidu: తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారు: నిమ్మల రామానాయుడు

  • జగన్ క్రిమినల్ పనులకు వివేకా హత్య ప్రత్యక్ష ఉదాహరణన్న నిమ్మల
  • గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన వ్యక్తి సీఎంగా రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్న 
  • తాడేపల్లి కుట్ర బయటకు వస్తుందని ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎద్దేవా
nimmala ramanaidu fires on cm jagan

తన చేతికి మట్టి అంటకుండా ముఖ్యమంత్రి జగన్ క్రిమినల్ పనులు చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సీఎం జగన్ క్రిమినల్ పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకా హత్య అని అన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన జగన్ సీఎంగా రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. 

శనివారం అమరావతిలో మీడియాతో నిమ్మల మాట్లాడుతూ.. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరి, అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అక్కర్లేదని అన్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని రక్షించకుంటే తాడేపల్లి కుట్ర బయటకు వస్తుందని జగన్ ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఆరోపించారు.

తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వివేకా క్యారెక్టర్ పై దిగజారి విమర్శలు చేశారని.. అఫిడవిట్లు వేశారని విమర్శించారు. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో రూ.92 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు అధికారికంగా జరిగితే.. అనధికారికంగా రూ.1.22 లక్షల కోట్లు జరిగాయని నిమ్మల ఆరోపించారు. రూ.11 వేల కోట్లు కమీషన్లను జగన్ దండుకుంటున్నారన్నారు. సీఎం జగన్ మద్య నిషేధం హామీని పక్కన పెట్టి.. మద్యంపైనే ఆదాయం రాబడుతున్నారని విమర్శించారు.

‘‘మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి.. మహిళా సంక్షేమం కోసం మాట్లాడితే నమ్మాలా? పార్కులు, కలెక్టరేట్లు, భూములను తాకట్టు పెట్టారు. ఇక ఇళ్ల స్థలాల పేరుమీద దోపిడీ జరిగింది. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పేదలకు కలిగిన లాభం గోరంత.. వైసీపీ నేతలకు లాభం కొండంత’’ అని నిమ్మల రామానాయుడు అన్నారు.

More Telugu News