Sachin Tendulkar: సచిన్ హాఫ్ సెంచరీ.. మైదానంలో కాదు.. జీవితంలో!

cricket legend sachin tendulkar turns into fifty years

  • ఈ రోజు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సచిన్
  • పాతికేళ్ల కెరియర్ లో ఎంతో మందిని ప్రభావితం చేసిన మాస్టర్ బ్లాస్టర్
  • రిటైర్ అయి పదేళ్లయినా తరగని పాప్యులారిటీ

సచిన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అదేంటి? క్రికెట్ కు ఎప్పుడో రిటైర్ మెంట్ ప్రకటించాడు కదా? మరి హాఫ్ సెంచరీ కొట్టడమేంటని ఆశ్చర్యపోవద్దు. అది నిజమే. కాకపోతే మైదానంలో కాదు! జీవితంలో! సచిన్  రమేశ్ టెండూల్కర్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

సచిన్ అంటే కేవలం ఆటగాడు కాదు.. క్రికెట్ ను మతంలా భావించే మన భారతదేశంలో అభిమానులకు ‘దేవుడు’. ఎందరికో స్ఫూర్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం. రికార్డులు దాసోహమైనా.. కోట్లకు పడగలెత్తినా.. చిన్నవయసులోనే ఆకాశమంత పాప్యులారిటీ వచ్చినా.. అడుగు నేలపైనే అని నమ్మిన అ‘సాధారణ’ వ్యక్తి. తనకు జట్టులో చోటు దక్కనప్పుడు.. ఆడుతున్నది జూనియర్లు అయినా సరే మైదానంలోకి వెళ్లి డ్రింక్స్ ఇవ్వగల సాదాసీదా వ్యక్తి. తాను ఆడిన పిచ్ ను కళ్లకు అద్దుకుని గౌరవించే మామూలు మనిషి.

ఇప్పటి తరానికి సచిన్ ఆట ఓ చరిత్ర కావచ్చు. కానీ ‘నైంటీస్ కిడ్స్’కి సచిన్ ఓ మధుర జ్ఞాపకం. ఓ స్ఫూర్తి. ఓ పాఠం. అతి చిన్న కెరియర్ లో అత్యంత ప్రభావం చూపిన అతి తక్కువ ఆటగాళ్లలో సచిన్ ఒకరు.

ఎత్తుపల్లాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. సచిన్ కూడా వీటిని ఎదుర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్ గా విఫలమైనా.. ఫామ్ కోల్పోయినా.. ‘నెర్వస్ నైంటీస్’తో ఇబ్బంది పడినా.. బహుమతిగా వచ్చిన కారును భారత్ కు తీసుకొచ్చే విషయంలో విమర్శలు ఎదుర్కొన్నా.. రికార్డుల కోసమే ఆడతాడని ఆరోపణలు చేసినా.. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లడంపై ప్రశ్నలు ఎదురైనా.. అన్నింటికీ ఆటతోనే బదులిచ్చాడు. ఆటలో ఓడిపోయి ఉండవచ్చు.. కానీ వ్యక్తిత్వంలో ఎన్నడూ ఓడిపోలేదు.

24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత 2013లో క్రికెట్ కు సచిన్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. పదేళ్లు గడిచిపోయింది. ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ సచిన్ పాప్యులారిటీ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఉంటుంది కూడా. ఎందుకంటే అతడు సచిన్ కాబట్టి. సచిన్ లాంటి ఆటగాడు.. న భూతో న భవిష్యతి!!  

Sachin Tendulkar
sachin turns into fifty
cricket legend
  • Loading...

More Telugu News