Arshdeep Singh: ఫినిషింగ్ లో ముంబయి కుదేల్... స్టంప్ లు విరిగేలా బంతులేసిన అర్షదీప్

Arshdeep stump breaking bowling shuts down Mumbai Indians

  • భారీ స్కోర్ల మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజేత
  • 13 పరుగుల తేడాతో విజయం
  • ముంబయి టార్గెట్ 215 రన్స్
  • 6 వికెట్లకు 201 రన్స్ చేసిన ముంబయి
  • ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్
  • రెండు పర్యాయాలు మిడిల్ స్టంప్ విరిగిపోయిన వైనం
  • ముంబయి గెలుపునకు 16 రన్స్ కావాల్సి ఉండగా... 2 రన్స్ ఇచ్చిన అర్షదీప్

ఐపీఎల్ లో మరో రసవత్తరపోరు జరిగింది. భారీ స్కోర్ల మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. 200కి పైగా స్కోర్లు నమోదైన హై ఓల్టేజ్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 13 పరుగుల తేడాతో నెగ్గింది. 215 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది. 

ఈ మ్యాచ్ లో హీరో అంటే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ అనే చెప్పాలి. ఆఖరి ఓవర్లో ముంబయి ఇండియన్స్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఈ దశలో బౌలింగ్ కు దిగిన లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు. 

ఈ ఓవర్లో అర్షదీప్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా, రెండు పర్యాయాలు మిడిల్ స్టంప్ విరిగిపోయింది. తొలుత తిలక్ వర్మ (3)ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్షదీప్... ఆ తర్వాతి బంతికి నిహాల్ వధేరాను తిప్పిపంపాడు. ఒక స్టంప్ విరిగిందంటే ఏదోలే అనుకోవచ్చు... రెండోసారి కూడా స్టంప్ విరిగిందంటే ఈ సర్దార్జీ వెరీ వెరీ స్పెషల్ అని తెలిసిపోతుంది. మొత్తానికి ఆ ఓవర్లో అర్షదీప్ 2 పరుగులే ఇచ్చాడు. తనను ఎందుకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటారో చాటిచెప్పాడు. 

ఓ దశలో ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ చూస్తే ఈ మ్యాచ్ లో సునాయాసంగా గెలుస్తుందనిపించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 44 పరుగులు చేయగా, కామెరాన్ గ్రీన్ 67 పరుగులతో అదరగొట్టాడు. మరో ఎండ్ లో సూర్యకుమార్ యాదవ్ సైతం రెచ్చిపోయి ఆడాడు. సూర్య 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కానీ కామెరాన్ గ్రీన్, సూర్య అవుటయ్యాక పరిస్థితి మారిపోయింది. 

టిమ్ డేవిడ్ (25 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ, అర్షదీప్ సింగ్ ఆఖర్లో వార్ వన్ సైడ్ చేసేశాడు. మొత్తమ్మీద అర్షదీప్ సింగ్ 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్ 1, లియామ్ లివింగ్ స్టోన్ 1 వికెట్ తీశాడు.

Arshdeep Singh
Punjab Kings
Mumbai Indians
IPL
  • Loading...

More Telugu News