Hyderabad: హైదరాబాద్‌లో నేడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!

  • 125 అడుగులతో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
  • విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు
  • విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ గురువుల ప్రార్థనలు
Traffic Restrictions In Hyderabad Today On Occasion Of Ambedkar Statue Unveiled Programme

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ ఉండడంతో నెక్లెస్ రోటరీ, ఐమ్యాక్స్ థియేటర్ పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
పీవీ విగ్రహం-నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌ను అనుమతించరు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజీగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను షాదాన్, నిరంకారి వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గంవైపు ట్రాఫిక్ అనుమతించరు. సోనాబి మసీదు వద్ద రాణిగంజ్, కర్బాలా వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

రసూల్‌పుర, మినిస్టర్ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వీలు లేదు. వారు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.

ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును మూసివేస్తారు. అలాగే, అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్ మీదుగా కాకుండా తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా మళ్లిస్తారు.

 దేశంలోనే ఎత్తైన విగ్రహం
హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేద్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 750 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి నడవనున్నాయి. 50 వేల మంది కూర్చునేలా విగ్రహ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. 

విగ్రహ తయారీకి రూ. 146.50 కోట్లు
అంబేద్కర్ విగ్రహ తయారీకి ప్రభుత్వం రూ. 146.50 కోట్లు కేటాయించింది. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. విగ్రహం కింద ఉన్న పీఠంలో 27,556 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో అంబేద్కర్ మ్యూజియం, ఆయన జీవితానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రెండు లక్షల మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు.

More Telugu News