BJP: చెన్నైలో ప్రధాని మోదీ స్పెషల్ సెల్ఫీ

Special Selfie PM Modi Meets Specially Abled BJP Worker In Chennai

  • దివ్యాంగ కార్యకర్త మనికందన్ తో ఫొటో దిగిన మోదీ
  • ఆయన జీవితం యువతకు ఆదర్శమని ప్రశంసలు
  • బీజేపీ పాలనలో చెప్పిన టైమ్ కన్నా ముందే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నామని వెల్లడి

పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే! ఈ పర్యటన సందర్భంగా చెన్నైలో తాను ఒక స్పెషల్ సెల్ఫీ తీసుకున్నానంటూ మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఓ దివ్యాంగుడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఆ ఫొటోలోని దివ్యాంగుడి గురించి చెబుతూ.. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఇలాంటి కార్యకర్తలను చూసినపుడు గర్వంగా ఫీలవుతుంటానని చెప్పారు.

ఈరోడ్ కు చెందిన తిరు ఎస్.మనికందన్ అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ బీజేపీ కార్యకర్తగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఓవైపు తన బిజినెస్ చూసుకుంటూనే బూత్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారని చెప్పారు. అంతేకాదు, తన రోజువారీ సంపాదనలో కొంతమొత్తం పార్టీకి విరాళంగా ఇస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. మనికందన్ జీవితం యువతకు ఆదర్శమని చెప్పారు.

గత ప్రభుత్వాలు చేయలేని పనిని తాము చేసి చూపిస్తున్నామని, దీనికి కారణం డెడ్ లైన్ విధించుకుని పనిచేయడమేనని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఏ ప్రాజెక్టులు చూసినా ఆలస్యమయ్యేవని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా అది పూర్తయ్యేంత వరకూ విశ్రమించబోమని, చెప్పిన గడువులోపలే పూర్తిచేస్తున్నామని మోదీ వివరించారు. బీజేపీ వర్క్ కల్చర్ వల్లే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతీ రూపాయికీ తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

BJP
modi
chennai tour
manikandan
special selfi
  • Loading...

More Telugu News