Australia: ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఖమ్మం యువకుడు.. చనిపోబోతున్న విషయం తెలిసి ముందుగానే మృతదేహాన్ని ఇంటికి పంపే ఏర్పాట్లు!

  • ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్న హర్షవర్ధన్
  • ఫిబ్రవరి 2020లో వివాహం
  • వీసా వచ్చాక భార్యను తీసుకెళ్తానంటూ అదే నెల 29న ఆస్ట్రేలియాకు
  • ఆ తర్వాత ఆరు నెలలకే కేన్సర్  సోకినట్టు నిర్ధారణ
  • తగ్గినట్టే తగ్గి తిరగబెట్టిన మాయదారి రోగం
  • చనిపోతున్నా ధైర్యం వీడకుండా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలకు ఏర్పాట్లు
Khammam Man died in Australia who know his death

చావు మనల్ని కౌగిలించుకోబోతోందని ముందుగానే తెలిస్తే.. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. ధైర్యం కోల్పోయి కుంగిపోతారు. మానసిక వేదనకు గురవుతారు. కానీ, ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఖమ్మం యువకుడు హర్షవర్ధన్ కుంగిపోలేదు. తాను చనిపోయిన తర్వాత జరగాల్సిన పనుల గురించి ఆలోచించాడు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. ఇష్టమైన వారితో గడిపాడు. తాను ఏ క్షణాన అయినా చనిపోవచ్చని తెలిసి మృతదేహాన్ని ఇంటికి పంపే ఏర్పాటు కూడా చేసుకున్నాడు. 

మనసును ద్రవింపజేసే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఏపూరి హర్షవర్ధన్ (33) బీఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి బ్రిస్బేన్ యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా చేరాడు. 20 ఫిబ్రవరి 2020లో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పి అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్టోబరులో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం రావడంతో పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్టు తేలింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేయమని కోరారు. అయితే, ఇక్కడే మంచి చికిత్స లభిస్తుందని, కంగారుపడొద్దని వారిని ఊరడించాడు.

విడాకులిచ్చి భార్య స్థిరపడేందుకు ఏర్పాట్లు
తనకు సోకిన కేన్సర్ నయమయ్యే పరిస్థితి లేదని, చనిపోవడం ఖాయమని తెలుసుకున్న హర్షవర్ధన్ తొలుత భార్యకు విడాకులిచ్చాడు. ఆపై జీవితంలో ఆమె స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న హర్షవర్ధన్‌కు ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో కేన్సర్ నయమైనట్టు వైద్యులు చెప్పారు. దీంతో గతేడాది సెప్టెంబరులో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్లాడు. అయితే, ఆ తర్వాత వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. 

చావు ముంచుకొస్తున్నా ధైర్యంగా..
మరణం తప్పదని వైద్యులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ హర్షవర్ధన్ ఎలాంటి భయానికి, ఆందోళనకు లోను కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తను మరణించిన తర్వాత మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకునేందుకు లాయర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తరచూ బంధువులకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. స్నేహితులను ఇంటికి పిలిపించుకుని ముచ్చట్లు చెప్పేవాడు. ఈ క్రమంలో గత నెల 24న విష్ణువర్ధన్ మృతి చెందాడు.

స్వగ్రామంలో అంత్యక్రియలు
ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంతో నిన్న ఉదయం ఖమ్మంలోని ఆయన ఇంటికి హర్షవర్ధన్ మృతదేహం చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు ఏపూరి రామారావు, ప్రమీల దంపతులు  కన్నీరుమున్నీరుగా విలపించారు. నిజానికి మేలో ఆయన సోదరుడు అఖిల్ వివాహం జరగాల్సి ఉంది. అందుకోసం మే 21న హర్షవర్ధన్ ఇండియా రావాల్సి ఉంది. అన్న వస్తాడనుకుంటే మృతదేహం రావడంతో ఆ తమ్ముడి వేదనకు అంతేలేకుండా పోయింది. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య హర్షవర్ధన్ అంత్యక్రియలు జరిగాయి.

More Telugu News