cellphone: సెల్ ఫోన్ సృష్టికర్తకు సెల్ ఫోన్ వాడకం బాగారాదట!

I will never understand how to use the cell phone the way my grandchildren says martin cooper

  • ఇతరులతో మాట్లాడడానికే సెల్ ఫోన్ ఎక్కువగా వాడతానంటున్న మార్టిన్ కూపర్
  • 1973లో మొబైల్ ఫోన్ ను తయారుచేసిన కూపర్
  • ఫస్ట్ కాల్ తన ప్రత్యర్థికే చేసినట్లు వివరించిన 94 ఏళ్ల ఇంజనీర్

సెల్ ఫోన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ.. వాటి వాడకం కాస్త శ్రుతిమించినట్లే ఉందని ‘ఫాదర్ ఆఫ్ ది సెల్ ఫోన్’ మార్టిన్ కూపర్ పేర్కొన్నారు. చాలామంది తమ సెల్ ఫోన్ లో మునిగిపోయి పరిసరాలను కూడా మరిచిపోతున్నారని ఆరోపించారు. ఫోన్ చూస్తూనే రోడ్డు దాటుతున్న జనాలను రోజూ చూస్తూ ఉంటానని కూపర్ చెప్పారు. దాదాపు 50 ఏళ్ల క్రితం మార్టిన్ కూపర్ సెల్ ఫోన్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన వయసు 94 ఏళ్లు.. ఇప్పటికీ కూపర్ న్యూయార్క్ లోని తన ఆఫీసుకు వెళ్తుంటారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు తన ఆఫీసులోనే ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా కూపర్ మాట్లాడుతూ.. సెల్ ఫోన్ ఈ స్థాయిలో ప్రజల జీవితంతో పెనవేసుకుపోతుందని భావించలేదని చెప్పారు. అయితే, భవిష్యత్తులో వ్యాధులను జయించేందుకు కూడా సెల్ ఫోన్ ఉపయోగపడుతుందని కూపర్ చెప్పారు. సెల్ ఫోన్ వాడకం విషయంలో ఇప్పటికీ తనకు పూర్తి అవగాహన రాలేదని అన్నారు. తన మనవలు, మునిమనవలు వాడుతున్నట్లుగా సెల్ ఫోన్ ను తాను వాడలేనని చెప్పారు. తన దగ్గరున్న ఆపిల్ స్మార్ట్ ఫోన్ ను చూపిస్తూ.. ఫోన్ ను ఎక్కువగా ఇతరులతో మాట్లాడడానికే వాడుతుంటానని కూపర్ వివరించారు. కాగా, 1973లో మార్టిన్ కూపర్ నేతృత్వంలోని మోటరోలా ఇంజనీర్ల బృందం సెల్ ఫోన్ ను తయారుచేసింది. 1973 ఏప్రిల్ 3న మొదటి ఫోన్ కాల్ ను తన ప్రత్యర్థి, ది బెల్ సిస్టమ్ కంపెనీ ఇంజనీర్ డాక్టర్ జోయెల్ ఎంగెల్ కు చేసినట్లు కూపర్ తెలిపారు.

cellphone
martin cooper
technology
USA
father of cellphone
  • Loading...

More Telugu News