Rahul Gandhi: నిజం, ధైర్యం, త్యాగం- ఇది మా వారసత్వం.. ఇదే మా బలం: రాహుల్ గాంధీ

Rahuls new Instagram post talks about strength of Gandhis

  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత
  • రాజీవ్ గాంధీ అంత్యక్రియల దృశ్యాలను పంచుకున్న రాహుల్
  • పరువు నష్టం కేసులో శిక్ష పడిన రాహుల్ పై అనర్హత వేటు వేసిన కేంద్రం

ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన ట్విట్టర్ బయోని 'డిస్ క్వాలిఫైడ్ ఎంపీ'గా మార్చిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలైట్ చేయడానికి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను వేదికగా మార్చుకున్నారు. తాజా పోస్ట్‌లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంత్యక్రియల విజువల్స్ ను పంచుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని మోస్తూ రాహుల్ ఆర్మీ ట్రక్కు వెనుక నడిచిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగాన్ని షేర్ చేశారు. దీనికి నిజం, ధైర్యం, త్యాగం - ఇది మా వారసత్వం, ఇదే మా బలం అని క్యాప్షన్ ఇచ్చారు.  2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్ సభ ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహం సందర్భంగా ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం వ్యాఖ్యలను ఈ వీడియోకు జోడించారు. 

‘32 ఏళ్ల క్రితం మా నాన్న మృతదేహాన్ని మోస్తూ రాహుల్ నడి ఎండలో ఆర్మీ ట్రక్‌ వెనుక నడిచారు. అప్పుడు మా నాన్న మృతదేహానికి త్రివర్ణ పతాకం చుట్టారు. కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్నను మీరు అవమానించారు. ఇప్పుడు ఆ అమరవీరుడి కుమారుడిని దేశద్రోహి అంటున్నారు. అతని దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ ఇంటిపేరును ఈ కుటుంబం ఎందుకు ఉపయోగించలేదని పార్లమెంటులో ప్రధాని అడిగారు. అలా ప్రశ్నించి మీరు మా మొత్తం కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానించారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పేర్కొన్నారు.

Rahul Gandhi
Congress
Instagram
Rajiv Gandhi
  • Loading...

More Telugu News