Prashant Kishor: విపక్షాలన్నీ కలిసినా 2024లో బీజేపీని ఏమీ చేయలేవు.. మళ్లీ అధికారం బీజేపీదే : ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

Opposition parties can not defeat BJP says Prashant Kishor
  • విపక్షాల ఐక్యత అంటే నాయకులు కలవడం మాత్రమేనన్న పీకే
  • బీజేపీని ఓడించాలంటే హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాలని సూచన
  • సిద్ధాంతాల పరంగా విపక్షాలు ఏకం కాలేవని వ్యాఖ్య
  • తన సలహాలను కాంగ్రెస్ పార్టీ స్వీకరించలేదన్న పీకే
  • ఎన్నికల్లో వచ్చే ఫలితాలే రాహుల్ పాదయాత్రకు అసలైన పరీక్ష అని వ్యాఖ్య
2024 ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. విపక్షాల ఐక్యత బీజేపీని ఏమీ చేయలేదని ఆయన అన్నారు. విపక్షాలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని... వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండదని చెప్పారు. విపక్షాల ఐక్యత అంటే కేవలం ఆయా పార్టీల నేతలు కలవడం మాత్రమేనని అన్నారు. విపక్షాలు బీజేపీని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇది త్రీ లెవెల్ పిల్లర్ అని అన్నారు. వీటిలో కనీసం రెండింటిని విపక్షాలు అధిగమించపోతే... బీజేపీని అవి కనీసం ఛాలెంజ్ కూడా చేయలేవని స్పష్టం చేశారు.  

హిందుత్వ సిద్ధాంతంపై పోరాడాలంటే విపక్షాలు తమ సిద్ధాంతాలను ఏకం చేయాలని... ఎవరి సిద్ధాతం వారిది అనుకుంటే బీజేపీని ఓడించలేవని పీకే చెప్పారు. గాంధీవాది, అంబేద్కరైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు... ఏదైనాసరే సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమని... అయితే ఈ సిద్ధాంతాల వల్లే ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదని చెప్పారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని... బీహార్ లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్ ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని అన్నారు.  

విపక్షాలు ఏకం కావడం, నాయకులు కలవడం గురించే మీడియా మాట్లాడుతుంటుందని పీకే అన్నారు. ఎవరు ఎవరితో కలిసి లంచ్ చేశారు, ఎవరు ఎవరిని టీకి పిలిచారనేది చూస్తుంటారని... తాను మాత్రం సిద్ధాంతాల పరంగా ఎలాంటి మార్పు ఉందనే కోణంలో చూస్తానని చెప్పారు. సిద్ధాంతాల ప్రకారం విపక్షాలు ఏకం కావడం కుదరని పని అని... అందుకే విపక్షాలు బీజేపీని ఓడించే అవకాశమే లేదని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీతో తనకు విభేదాలు వచ్చాయనే అంశంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ కి పునర్జన్మను ఇవ్వాలని తాను అనుకుంటున్నానని... ఎన్నికల్లో గెలవాలని వారు అనుకుంటున్నారని... తన సలహాలను పాటించేందుకు వారు అంగీకరించలేదని పీకే చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ... ఎన్నికల్లో వచ్చే ఫలితాలే యాత్రకు అసలైన పరీక్ష అని అన్నారు. యాత్ర అంటే కేవలం నడవడం మాత్రమే కాదని... ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయని చెప్పారు. ఆరు నెలల పాదయాత్ర తర్వాత మార్పు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.
Prashant Kishor
BJP
Opposition Parties
Congress

More Telugu News