Hyderabad: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఆరుగురి సజీవ దహనం

6 dead in Secunderabad Swapnalok Complex fire accident

  • మృతులందరూ కాల్ సెంటర్ ఉద్యోగులే
  • బాధితుల్లో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు
  • ప్రమాదానికి తెలియని స్పష్టమైన కారణం

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గత రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరందరూ ఐదో అంతస్తులో ఉన్న కాల్‌సెంటర్ ఉద్యోగులే. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు. ప్రమాదం నుంచి మరో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. పొగ కారణంగా అస్వస్థతకు గురైన వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు. గత రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత 8వ అంతస్తులో మొదలైన మంటలు ఆ వెంటనే 7,6,5 అంతస్తులకు వ్యాపించాయి.  

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని స్కై లెవల్ క్రేన్‌ సాయంతో రక్షించి కిందికి దించారు. పలు అంతస్తుల్లోని అద్దాలను పగలగొట్టారు. అలాగే, చుట్టుపక్కల నివాసాల్లోని వారిని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఐదో అంతస్తులో కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులు కొందరు చిక్కుకుపోయారని తెలియడంతో అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది అతి కష్టం మీద అక్కడికి వెళ్లారు. 

అయితే, హాలంతా పొగచూరుకుపోయి ఉండడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తించడం కష్టమైంది. లోపల పడివున్న ఆరుగురిని రక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటల తర్వాత భవనంలో మళ్లీ మంటలు వ్యాపించాయి. మొత్తం 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మృతులందరూ కాల్ సెంటర్ ఉద్యోగులే..
అగ్ని ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు. అయితే, రాత్రి ఏడు గంటల సమయంలో కింది నుంచి రాకెట్ (టపాకాయ) ఒకటి పైకి వెళ్లినట్టు అనిపించిందని, ఆ తర్వాత మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. భవనం కింది అంతస్తులోని ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగి వైర్ల ద్వారా అవి ఎనిమిదో అంతస్తులోకి చేరి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, మృతులను కాల్ సెంటర్ ఉద్యోగులు త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు.

Hyderabad
Secunderabad
Swapnalok Complex
Fire Accident
  • Loading...

More Telugu News