Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పోలీసుల విఫలయత్నం

Pak Police 8 Hour Long Operation To Arrest Imran Khan Unsuccessful

  • లాహోర్ లో మాజీ ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత
  • పోలీసులపైకి రాళ్లు రువ్విన పీటీఐ కార్యకర్తలు
  • బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు.. ఓ కార్యకర్త మృతి
  • రాత్రంతా కొనసాగిన హైడ్రామా.. అయినా కుదరని అరెస్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం లాహోర్ లో ఉద్రిక్తతకు దారితీసింది. ఇమ్రాన్ ఇంటి ముందు గందరగోళం నెలకొంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంతో ఆందోళన మొదలైంది. తనను అరెస్టు చేసేందుకు ఇంటి ముందు పోలీసులు నిల్చున్నారని, అరెస్టు పేరుతో తనను చంపేస్తారని ఆ వీడియో సందేశంలో ఇమ్రాన్ పేర్కొన్నారు.

‘ఇమ్రాన్ ను జైలుకు పంపించడం ద్వారా లేదా చంపేయడం ద్వారా ప్రజల పోరాటాన్ని అణచివేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది తప్పని మీరు నిరూపించాలి. నన్ను జైలులో పెట్టినా, చంపేసినా.. మీ హక్కుల కోసం పోరాడడం మాత్రం ఆపొద్దు’ అంటూ సూచించారు. దీంతో లాహోర్ లోని ఇమ్రాన్ ఇంటి వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇమ్రాన్ ను అరెస్టు చేయకుండా పోలీసులను అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపైకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వాటర్ కేనన్లతో గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొడవ సద్దుమణగలేడు. పోలీసులను ముందుకు రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఓ దశలో కర్రలతో పాటు చేతికందిన వస్తువులతో పోలీసులపైకి దాడి చేశారు. దీంతో మరింత మంది సిబ్బందిని పిలవాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాత్రంతా ప్రయత్నించినా ఇమ్రాన్ ను అరెస్టు చేయడం కుదరలేదని వివరించారు. ఈ ఘటనలో ఓ కార్యకర్త చనిపోగా పలువురికి గాయాలయ్యాయని తెలిపారు.

ఇమ్రాన్ అరెస్టు ఎందుకు..?
తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ పోలీసులు ప్రయత్నించారు. దేశ అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు దేశవిదేశాల నుంచి అందుకునే కానుకలను భద్రపరిచే ఖజానా పేరే తోషాఖానా.. బహుమతుల విలువ రూ.30 వేల కంటే తక్కువుంటే వాటిని ఆయా నేతలే తీసుకోవచ్చు. అంతకంటే విలువైన వస్తువులను మాత్రం తప్పనిసరిగా తోషాఖానాకు అప్పగించాల్సిందే!

ప్రధానిగా ఉన్న సమయంలో అందుకున్న బహుమతులను ఇమ్రాన్ ఖాన్ తోషాఖానాకు అప్పగించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలు విలువైన కానుకలను తనే ఉంచేసుకున్నాడు.. ఓ వాచీ అమ్ముకునేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం బయటపడిందని సమాచారం. ఈ విషయంలో ఇమ్రాన్ పై కేసు నమోదైంది.

విచారణకు హాజరు కావాలంటూ కోర్టు రెండుసార్లు నోటీసులు పంపినా ఇమ్రాన్ పట్టించుకోలేదు. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఇమ్రాన్ పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో మంగళవారం లాహోర్ చేరుకున్న ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.

Pakistan
Imran Khan
PTI
Imran arrest
lahore
tension
  • Loading...

More Telugu News