K Kavitha: కవిత దీక్షకు అనుమతి నిరాకరణ.. ప్రెస్ మీట్ లోనే చెప్పిన పోలీసులు!

delhi police didnt give permition for kavitha deeksha at jantar mantar

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై రేపు జంతర్ మంతర్ లో దీక్షకు కవిత ఏర్పాట్లు
  • గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన పోలీసులు
  • కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేకుంటే వేదికను మార్చుకోవాలని సూచన
  • తమ దీక్షలో మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని చెప్పిన ఎమ్మెల్సీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావాలనే డిమాండ్ తో రేపు నిరసనలు చేపట్టాలని కవిత భావించారు. అయితే పలు కారణాలతో పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు చెప్పారు.

గురువారం ఢిల్లీలో మీడియాతో కవిత మాట్లాడుతుండగానే.. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇవ్వడం గమనార్హం. భద్రతా కారణాల రీత్యా కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేకుంటే వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచించారు.

తాము ముందే అనుమతి తీసుకున్నామని, ఇప్పుడు ఇలా రద్దు చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు. 5 వేల మందితో సభ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే అనుమతి ఇచ్చారని తెలిపారు. అయితే బీజేపీ వాళ్లు కూడా ధర్నాకు పర్మిషన్ కోరారని, దీంతో జంతర్ మంతర్ లోని సగం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ సూచించినట్లు తెలిపారు.

ఇప్పటికిప్పుడు బీజేపీ వాళ్లు సభ పెట్టుకోవటం ఏంటని, ఇదంతా కావాలనే చేస్తున్నట్లు తెలుస్తోందని కవిత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. అయితే తమ దీక్షలో మాత్రం మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

K Kavitha
jantar mantar
delhi police
deeksha at jantar mantar
BRS
  • Loading...

More Telugu News