Tiger: ఆరోగ్యంగా పులి కూనలు.. ముసలిమడుగు సమీపంలో కనిపించిన తల్లి పులి!

Tiger Cubs Are Now Healthy Found Their Mother

  • తల్లి నుంచి తప్పిపోయి గ్రామంలోకి వచ్చిన నాలుగు పులికూనలు
  • రెండు చోట్ల పాదముద్రలు గుర్తించిన అధికారులు
  • కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు ప్రారంభమైన మిషన్

తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పులికూనలు ఇటీవల నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామానికి వచ్చేశాయి. వాటిని కుక్కల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాలు లేక నీరసంగా ఉన్న వాటికి అధికారులు ఆహారం అందించినా ముట్టలేదు. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలిపెట్టినా కదల్లేదు. దీంతో వాటిని ఆత్మకూరు ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లోని ఏసీ గదిలో ఉంచారు. వైద్య నిపుణులు వాటికి చికిత్స అందిస్తున్నారు. వాటికి పాలు, కాల్చిన చికెన్ లివర్‌ను ఆహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం అవి ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

తల్లి పులి జాడ
తప్పిపోయిన పిల్లల జాడ కోసం వెతుకుతున్న తల్లిపులి టీ-108 ఆనవాళ్లు తాజాగా లభ్యమయ్యాయి. ముసలిమడుగు గ్రామ సమీపంలో పులి కనిపించినట్టు గొర్రెల కాపరి ఒకరు అటవీ అధికారులకు సమాచారం అందించారు. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని జొన్న చేను నుంచి రోడ్డు దాటి నీలగిరి చెట్లలోకి వెళ్లినట్టు అతడు తెలిపాడు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. పెద్దగుమ్మడాపురం సమీపంలోని ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రను గుర్తించారు. దీనిని ఆడపులి పగ్‌మార్క్‌గా గుర్తించారు. రెండు చోట్ల కనిపించిన ఈ గుర్తులు టీ-108విగా అధికారులు భావిస్తున్నారు.

కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు 350 మంది..
పులి కూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనతో స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను అధికారులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఎన్ఎస్‌టీఆర్ ఎఫ్‌డీ చైర్మన్‌గా 9 మందితో కూడిన కమిటీని నియమించారు. పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు దాదాపు 350 మంది అటవీ ఉద్యోగుల, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.

Tiger
Tiger Cubs
Nandyal
Peddagummadapuram
Andhra Pradesh
  • Loading...

More Telugu News