Yediyurappa: హెలికాప్టర్ ల్యాండింగ్ లో సమస్య.. మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో!

karnataka ex cm bs yediyurappa chopper makes emergency landing post technical glitch
  • కర్ణాటకలోని కలబురగిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన యడియూరప్ప
  • హెలిపాడ్ వద్ద పోగైన ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు
  • హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా చుట్టుముట్టిన వ్యర్థాలు
  • వెంటనే అప్రమత్తమై చాపర్ ను గాల్లోకి లేపిన పైలట్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్పకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్ ను గాల్లోకి లేపి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కర్ణాటకలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారంలో యడియూరప్ప కీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు సోమవారం ఆయన వెళ్తుండగా కర్ణాటకలోని కాలబురగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు పోగయ్యాయి. ల్యాండింగ్ సమయంలో గాలికి ప్లాస్టిక్ కవర్లు చాపర్ ను చుట్టుముట్టాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. తర్వాత అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు.

ఈ ఘటన కారణంగా యడియూరప్ప పర్యటన అర్థాంతరంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. యడియూరప్పకు స్వాగతం పలికేందుకు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వారందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియోను న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్‌ఐ’ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Yediyurappa
chopper emergency landing
Karnataka
technical glitch

More Telugu News