epfo: పెన్షనర్లకు షాక్ ఇచ్చిన ఈపీఎఫ్ వో

epfo ordered pensioners who draws higher amount to submit proofs

  • అధిక పింఛను చెల్లించకుండా ఉండేందుకు కొర్రీలు
  • అధిక పెన్షన్ తీసుకునేవారు ఆధారాలు ఇవ్వాలని ఆదేశం 
  • వారం గడువు పెట్టిన ఈపీఎఫ్ వో

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ లబ్ధి దారులకు షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ చేసి అధిక పింఛను తీసుకుంటున్న వారిని ఆధారాలు జత చేయాలని కోరింది. నాడు రూ.6,500 గరిష్ఠ వేతన పరిమితిగా అమల్లో ఉంది. అయినప్పటికీ కొందరు తమ వాస్తవ వేతనం (మూలవేతనం, డీఏ) ఆధారంగా ఈపీఎఫ్, పెన్షన్ ఖాతాలకు జమ చేశారు. దీంతో వారు అధిక పింఛను పొందుతున్నారు. అలా అధిక పింఛను పొందేందుకు తీసుకున్న అనుమతి పత్రాలను జత చేయాలని తాజాగా ఈపీఎఫ్ వో కోరడం పింఛను దారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఉద్యోగులు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధిక పింఛనుకు అర్హత పొందారు. వాస్తవ వేతనం ఆధారంగా జమలకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో 2014 సెప్టెంబర్ 1కి ముందు సర్వీసులో ఉన్న వారు తమ వాస్తవ వేతనం ఆధారంగా అధిక పింఛనుకు జమ చేశారు. అంటే నాడు అమల్లో ఉన్న రూ.6,500పై ఉద్యోగి 12 శాతం, సంస్థ 12 శాతం సమకూర్చాల్సి ఉంది. సంస్థ జమచేసే వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్ కిందకు వెళ్లేది. కానీ, రూ.6,500కు పైన మూలవేతనం, డీఏ ఉన్నవారు ఆ ప్రకారమే ఈపీఎఫ్, ఈపీఎస్ కు అధికంగా జమలు చేశారు. కానీ, దీనికి పేరా 26(6) కింద, పేరా 11 (3) కింద ఉద్యోగి, సంస్థతో కలసి దరఖాస్తులు చేసుకుని అనుమతి తీసుకుని ఉండాలన్నది షరతు. నాటి అనుమతి పత్రాలు వారం రోజుల్లోగా సమర్పించాలని ఈపీఎఫ్ వో పెన్షనర్లకు ఆదేశించింది. లేని పక్షంలో రూ.6,500 గరిష్ఠ వేతన పరిమితి ఆధారంగానే పెన్షన్ ను లెక్కిస్తామని తేల్చి చెప్పింది.

epfo
pensioners
submit proofs
shock
  • Loading...

More Telugu News