Zoom: టాప్ బాస్ ను తొలగించిన ‘జూమ్’

Zoom company Fires Its President greg tomb
  • ఇటీవలే 13 వందల మంది ఉద్యోగులపై వేటు
  • తాజాగా కంపెనీ ప్రెసిడెంట్ ను సాగనంపిన వైనం
  • తొలగింపునకు కారణం వెల్లడించని కంపెనీ
కార్పొరేట్ కంపెనీలలో కొలువుల కోత సామాన్యులనే కాదు టాప్ బాస్ లనూ వదలడంలేదు. వందలు, వేలల్లో ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లే ఉన్నత ఉద్యోగులను కూడా కంపెనీలు సాగనంపుతున్నాయి. ఇందుకు అవసరమైతే పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించడానికీ సిద్ధపడుతున్నాయి. తాజాగా ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ కంపెనీ ‘జూమ్’ కూడా ఇదే పని చేసింది. సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టాంబ్ ను తొలగించింది. ఫిబ్రవరిలో 1300 మంది ఉద్యోగులపై వేటు వేసింది.

ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ప్రెసిడెంట్ ను కూడా తీసేసింది. అయితే, ప్రెసిడెంట్ గ్రెగ్ టాంబ్ ను ఎందుకు తొలగించాల్సి వస్తుందనే కారణాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దీంతో గ్రెగ్ టాంబ్ కు భారీ మొత్తంలో పరిహారం లభించనుందని సమాచారం. గూగుల్ మాజీ ఉద్యోగి, పేరొందిన బిజినెస్ మాన్ గ్రెగ్ టాంబ్ గతేడాది జూన్ లోనే ‘జూమ్’లో ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టారు. కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో, లాభాల బాటలోకి నడపడంలో గ్రెగ్ శాయశక్తులా కృషి చేశారు.

ప్రెసిడెంట్ గా గ్రెగ్ నేరుగా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎరిక్ యువాన్ కు జవాబుదారీగా వ్యవహరించారు. ఇటీవల కంపెనీ సేల్స్ తగ్గిపోవడం, డిమాండ్ కూడా తగ్గడంతో ఫిబ్రవరి 7న జూమ్ తొలిసారిగా లేఆఫ్ లు ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులలో 15 శాతం మంది (1,300) ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ టాంబ్ ను కూడా ఇంటికి పంపించింది. అయితే, గ్రెగ్ టాంబ్ స్థానాన్ని ఇప్పటికిప్పుడు వేరొకరితో భర్తీ చేసే ఉద్దేశం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Zoom
lay offs
president
greg tomb

More Telugu News